కొనసాగుతున్న రైతుల మరణమృదంగం

5
కరీంనగర్‌ జిల్లాలో మరోఇద్దరు అన్నదాతల ఆత్మహత్య

కరీంనగర్‌,సెప్టంబర్‌ 3 (జనంసాక్షి) :

జిల్లాలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. కాలం కలిసిరాకపోవడం, వేసిన పంటలు విత్తక పోవడంతోపాటు పెట్టిన పెట్టుబడులు ఆదిలోనే గుల్ల కావడంతో మనస్థాపానికి గురవుతున్న అన్నదాతలు తనువులు చాలిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో వరుసగా మూడు సీజన్ల పంటలు సాగుచేసుకోలేకపోయారు. దీని వల్ల అన్నదాతలను ఆదుకుంటామని చెప్పే భరోసాను ప్రభుత్వం ఏ కోశాన కూడా ఇవ్వక పోవడంతో  కలతచెంది తనువులు చాలిస్తున్నారు. జిల్లాలో బుధవారం ఇరువురు వ్యక్తులు దుర్మరణం పాలుకాగా గురువారం కూడా మరో ఇద్దరు బలవంతంగా మరణించిన సంఘటనలు చోటు చేసుకున్నాయి., కోరుట్ల మండలం అయిలాపూర్‌ గ్రామానికి చెందిన రిబ్బాస రాజమల్లయ్య(48) చేసిన అప్పులను చెల్లించలేననే బాధతో గురువారం ఉదయమే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓవైపు పంట పెట్టుబడులు వచ్చే అవకాశం లేకపోవడం మరోవైపు భార్య అనారోగ్యానికి గురి కావడంతో చేసిన అప్పులు కూడా ఆయనను మానసికంగా కృంగదీశాయి. దీంతో ఆత్మహత్యచేసుకుని మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా రాయికల్‌ మండలం తాట్లవాయి గ్రామానికి చెందిన గల్ల గంగరాజం(45) కూడా గురువారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవలే అప్పు చేసి మరీ మొక్కజొన్న, పసుపు పంటలు వేశారు. ఆపంట కూడా ఎండిపో వడంతో గంగరాజం తీవ్రమనస్థాపానికి గురై పురుగుల మందు సేవించి తెల్లవారుజామున మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీ సులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నప్పటికి ప్రభుత్వం మాత్రం ఆవేవి కాదన్నట్లుగా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. కనీసం కరువు జిల్లాలుగానైనా ప్రకటించి ఆదుకోవాల్సింది పోయి అసలు ఆత్మహత్యలే జరుగతలేవనే రీతిలో మాట్లాడుతూ రైతులను మరింత కృంగతీస్తుందనేది వాస్తవం.