కొలువుల జాతర
– 770 ఉద్యోగాలకు నోటిఫికేషన్
హైదరాబాద్,ఆగస్ట్19(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కల నెరవేరనుంది. తొలి తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. టీఎస్‌పీఎస్సీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ పోస్టులకు సంబంధించి తొలి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 770 ఏఈఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 20న ఆన్‌లైన్‌లో రాత పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. ఏఈఈ పోస్టులకు బీటెక్ సివిల్ గ్రాడ్యుయేట్లు అర్హులుగా ప్రకటించారు. ఐదు విభాగాల్లో వీటిని భర్తీ చేస్తారు. రూరల్ వాటర్ సప్లయ్‌లో 418, పబ్లిక్ హెల్త్‌లో 121, ఇరిగేషన్‌లో 143, ఆర్ అండ్ బీలో 83, మున్సిపల్‌లో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 3. సెప్టెంబర్ 20న హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక పరీక్ష ఫలితాలను 40 రోజుల్లో ప్రకటించనున్నారు. వివరాల కోసం వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. ఇకపోతే టీఎస్‌పీఎస్సీ ద్వారా నిర్వహించబోయే పరీక్షలకు ఆగస్టు నెలఖారులోగా సిలబస్‌ను పూర్తి స్థాయిలో ప్రకటిస్తామని చైర్మన్ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు. అక్టోబర్ చివర్లో గ్రూప్-2 నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. గ్రూప్-1 నిర్వహణలో కొన్ని సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఇక అక్టోబర్ నాటికి కమల్‌నాథన్ కమిటీ నివేదిక వస్తే మరిన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కనుక అక్టోబర్ నెలలో గ్రూప్-2 నోటిఫికేషన్ వస్తుందన్నారు. డిసెంబర్‌లోగా దాదాపు 80 శాతం ఉద్యోగాల భర్తీ జరుగుతుందని వెల్లడించారు. ఇక వ్యవసాయ శాఖలో ఉద్యోగాలకు సెప్టెంబర్ నెలలో నోటిఫికేషన్ వస్తుందని ప్రకటించారు. వ్యవసాయ శాఖ తర్వాత మిగతా శాఖల్లో ఖాళీ ఉద్యోగాలకు ప్రకటన ఉంటుందన్నారు.