కొలువుల జాతర
– నాలుగు నోటిఫికేషన్లు జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ
హైదరాబాద్,డిసెంబర్30(జనంసాక్షి):తెలంగాణలో సర్కారు కొలువుల జాతర కొనసాగుతోంది. నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త సంవత్సర కానుక ప్రకటించింది. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-2 నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 796 ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకేసారి నాలుగు నోటిఫికేషన్లు జారీ చేసింది. అన్ని పోస్టులకు డిసెంబర్ 31 (రేపటి) నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.గ్రూప్-2లో మొత్తం 439 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 220 ఉన్నాయి. గ్రూప్-2 పోస్టులకు డిసెంబర్ 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 24, 25 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహిస్తారు.గ్రూప్-2 కాకుండా మరో 357 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అగ్రికల్చరల్ సబ్ సర్వీస్ డిపార్ట్ మెంట్ లో 311 అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ గ్రేడ్-2 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటికి డిసెంబర్ 31 నుంచి జనవరి 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చిలో పరీక్ష ఉంటుంది.ఇక హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ బోర్డులో 44 టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు డిసెంబర్ 31 నుంచి జనవరి 28 దాకా దరఖాస్తులు స్వీకరించి, మార్చిలో పరీక్ష నిర్వహిస్తారు. హెచ్‌ఎండబ్ల్యూఎస్ లో రెండు ఫైనాన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు డిసెంబర్ 31 నుంచి జనవరి 22 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 21న పరీక్ష ఉంటుంది.రాష్ట్ర ప్రభుత్వం పెద్దెత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.