కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమం
మంత్రి హరీశ్‌రావు
సంగారెడ్డి : రాష్ట్రంలోని కొంత మంది నాయకులు డబుల్ ఇంజిన్ అని మాట్లాడుతున్నారు.. అసలు డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాల్లో ఇలాంటి డబుల్ బెడ్రూం ఇండ్లు ఉన్నాయా? అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సూటిగా ప్రశ్నించారు. కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
కొన్ని రాజకీయ పార్టీల జీవితమంతా ధర్నాలే అని ప్రతిపక్షాలను ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు. పేద ప్రజలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ బీఆర్ఎస్ సర్కార్ మాత్రం పేదలను గుండెల్లో పెట్టి చూసుకుంటుందన్నారు. ఇవాళ ప్రతిపక్షాలు అనేక రకాల మాటలు చెప్తూ ప్రజలను మభ్య పెట్టేందుకు యత్నిస్తున్నాయి. మీరు ఆలోచించండి.. ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి కార్యక్రమం తెచ్చింది కేసీఆర్ కాదా..? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. బస్తీ దవఖానాల్లో పేద రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. ఉచితంగా మంచినీళ్లు అందిస్తున్నాం. గత ప్రభుత్వాల హయాంలో నల్లా బిల్లు కట్టకపోతే తెల్లారేసరికి కనెక్షన్ కట్ చేసేవారు. కేసీఆర్ హయాంలో మంచినీళ్లు అందించాం. ధర్నాలు లేనే లేవు అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీజేపీ నేతలు మాటలు చెప్పారు.. కానీ చేసి చూపించలేదు అని మంత్రి మండిపడ్డారు. ఇవాళ పనిచేసే వారెవరో, మాటలు చెప్పే వారెవరో దయచేసి ఆలోచించాలి. కొందరు డబుల్ ఇంజిన్ అని మాట్లాడుతున్నారు. డబుల్ ఇంజిన్ గవర్నమెంట్లలో ఇలాంటి డబుల్ బెడ్రూం ఇండ్లు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టారా? కలలోనైనా ఊహించారా? డబుల్ ఇంజిన్‌లు అన్ని ట్రబులే తప్పా అక్కడ డబుల్ బెడ్రూం ఇండ్లు లేవు. ఈ దేశంలో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ, మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, రూ. 70 లక్షల విలువ చేసే ఇండ్లను మీ చేతుల్లో పెడుతున్నాం. దయచేసి ఈ ఇండ్లను అమ్ముకోవద్దు. ఈ ఇండ్లలో పది కాలాల పాటు ఆత్మగౌరవంతో ఉండాలి. మీరందరూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను దీవించాలని కోరుతున్నాను. ఎన్నికల ముందు అనేక రాజకీయ పార్టీల నాయకులు వస్తారు.. అందమైన నినాదాలు ఇస్తుంటారు. మనకు కావాల్సింది నినాదాలు కాదు.. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రభుత్వం కావాలి. ప్రజల కలలను నిజం చేసే నాయకుడు కేసీఆర్ మాత్రమే అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.