కోటా బిల్లుకు రాజ్యసభ ఆమోదం

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 17 (జనంసాక్షి):
ప్రభుత్వ ఉద్యోగాలలో పదోన్న తుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల బిల్లు రాజ్యసభలో సోమవారంనాడు ఆమోదంపొందిం ది. ఈ బిల్లుకు అనుకూలంగా 184ఓట్లు రాగా, వ్యతిరేకంగా 8ఓట్లు మాత్రమే వచ్చా యి. రాజ్యసభలో ఎస్సీ, ఎస్టీలకోటా బిల్లు ఆమోదం పొంద డంతో తదుపరి ఆమోదం కోసం లోక్‌సభకు పంపుతారు. ఈ బిల్లును సమాజ్‌వాదిపార్టీ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ప్రభుత్వం రాజ్యసభలో ఓటింగ్‌కు మొగ్గు చూపింది. సమాజ్‌వాది పార్టీ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్‌ చేసినప్పటికీ బిఎస్పీ అధినేత్రి మాయావతి ఈ బిల్లును ఆమోదించాలంటూ అన్ని పార్టీల సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఎఫ్‌డిఐలపై జరిగిన ఓటింగ్‌లో రాజ్యసభలో యూపిఏ ప్రభుతానికి మద్దతు పలికిన బిఎస్పీ కోటా బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అగ్రవర్ణాల ఓట్లపై కన్నేసిన ఎస్పీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. బిఎస్పీ చేతిలో కీలుబొమ్మగా యూపిఏ వ్యవహరిస్తుందని కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. కోటాబిల్లు ఆమోదం పొందితే యూపిఏకి వెలుపలి నుంచి అందిస్తున్న మద్దతు విషయమై తాము పునరాలోచించుకోవాల్సి ఉంటుందని కూడా ఆయన హెచ్చరించిన విషయం తెలిసింది. మొత్తం మీద మాయావతి తన పంతం నెగ్గించుకున్నారు.