కోదండరామ్ ఆవేదనను కాంగ్రెస్ అర్థం చేసుకునేనా?
హైదరాబాద్,నవంబర్26(జనంసాక్షి): కాంగ్రెస్ ఎన్ని అవమానాలు చేసినా సీట్ల విషయంలో తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్ సరద్‌ఉకుపోతున్నారు. అయినా ఆయన తన ఆవేదనను సమయం వచ్చినప్పుడల్లా వెల్లగక్కుతున్నారు. అయితే కెసిఆర్ చేసిన అవమానం ముందు ఇది ఏమంత అన్న భావనలో ఉన్నారు. అందుకే కూటమి విచ్చిన్నం కాకుండా సర్దుకుపోయే ప్రయత్నమే చేశారు. ప్రజాకూటమి సీట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందని కోదండరాం తాజాగా చేసిన ఆరోపణలే ఇందుకు నిదర్శనం. తెజసకు 8 సీట్లు కేటాయించాలని కోరగా నాలుగు సీట్లు మాత్రమే ఇచ్చారని, అందులో రెండు సీట్లను తాము త్యాగం చేశామన్నారు. మిగిలిన రెండు సీట్లలో కాంగ్రెస్ స్నేహపూర్వక పోటీలో ఉందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడేందుకే ప్రజాకూటమిగా ఏర్పడాల్సి వచ్చిందన్నారు. ఎన్నికల్లో ప్రజాకూటమి విజయం సాధించి అధికారంలోకి వస్తుందన్నారు. తెరాసను గద్దె దించి నిరంకుశపాలనను అంతమొందించాలనేదే అజెండాగా కూటమి పనిచేస్తోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన అజెండాగా అన్ని రాజకీయ పార్టీలూ ఒకటైనట్లే.. ఇప్పుడు కూడా తెరాస పాలనకు వ్యతిరేకంగా పార్టీలు కూటమిగా మారాయన్నారు. కూటమిలోని పార్టీల మధ్య ఐక్యత కొనసాగేందుకు నియోజకవర్గ స్థాయిలో నాలుగు పార్టీలతోనూ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. మండల, గ్రామస్థాయిలో ప్రతిరోజూ చర్చించుకుంటూ కూటమి అభ్యర్థుల విజయానికి ఈ కమిటీలు వ్యూహాలు రూపొందిస్తాయన్నారు. సీట్ల పంపిణీలో తమ పార్టీని కాంగ్రెస్ అవమానించిందన్న బాధను దిగమింగుకుని మరీ కూటమితో కలిసి నడవడానికి కోదండరాం సిద్ధపడ్డారు. నిజానికి కోదండరాం భావజాలానికి కూటమిలోని ప్రధాన పార్టీల భావజాలానికి సరిపడదు. తెలంగాణకు పట్టిన కేసీఆర్ అనే దయ్యాన్ని వదిలించాలని అంతా నిర్ణయించారు.