కోబ్రాపైనే విక్రమ్ ఆశలు
చియాన్ విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వెండితెరపై ఈయన చేసిన ప్రయోగాల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కోలీవుడ్‌లో కమల్ తర్వాత ఎక్కువగా ప్రయోగాలు చేసిందే విక్రమ్ మాత్రమే అని తమిళ తంబిలు చెబుతుంటారు. ’శివపుత్రుడు’, ’అపరిచితుడు’, ’ఐ’, ’ఇంకొక్కడు’ ఇలా పలు సినిమాల్లో ప్రయోగాలు చేసి విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్నాడు. అయితే గత కొంత కాలంగా ఈయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఈయన నటించిన ’కోబ్రా’ పైనే విక్రమ్ ఆశలన్ని పెట్టుకున్నాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి. చిత్రం నుండి విడుదలైన విక్రమ్ పోస్టర్‌లు అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో విక్రమ్ ఏడు రకాల పాత్రల్లో కనిపించనున్నాడట. అంతే కాకుండా ఈ ఏడు పాత్రలకు తనే డబ్బింగ్ చెప్పాడట. పాత్ర తీరును బట్టి, వివిధ వేరియేషన్స్‌లో వాయిస్ మాడ్యూలేషన్ ఉంటుందట. ఇలా ఏడు రకాలుగా గొంతు మార్చి మాట్లాడటం అంటే విశేషం అనే చెప్పాలి. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో ’కేజీఎఫ్’ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఏ.ఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్డూడియోస్ పతాకంపై ఎస్.ఎస్. లలిత్ కుమార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాడు. ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ ఖాన్ ఈ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.కాగా ఈ చిత్రాన్ని ముందుగా ఆగస్టు 11న విడుదల చేస్తున్నట్లు మేకర్స్
ప్రకటించారు. తాజాగా ఈ చిత్రం విడుదల వాయిదా పడ్డట్లు తెలుస్తుంది. సీజి కారణంగా విడుదల పోస్ట్ పోన్ అయిందని కోలీవుడ్ వర్గాల సమాచారం.