కోల్‌కతా కుమ్మేసింది
►10 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్‌పై ఘనవిజయం
►చెలరేగిన లిన్, గంభీర్
కోల్‌కతా నైట్ రైడర్స్ కసితీరా ప్రతీకారం తీర్చుకుంది. గత సీజన్‌లో లయన్స్ చేతిలో రెండుసార్లు చావు దెబ్బ తిన్న గంభీర్ సేన వారి సొంతగడ్డపైనే బెబ్బులిలా గర్జించింది. క్రిస్ లిన్ ఊచకోతకు కెప్టెన్ గంభీర్ సొగసైన షాట్లు తోడవ్వడంతో లయన్స్ ఈసారి తోక ముడిచింది. ఏమాత్రం పసలేని బౌలింగ్‌కు తోడు పేలవ ఫీల్డింగ్‌ను సొమ్ము చేసుకున్న కోల్‌కతా ఓపెనర్లు ఆరంభం నుంచే బౌండరీల వర్షం కురిపిస్తూ సాగించిన విధ్వంసాన్ని రైనా బృందం ఏమాత్రం అడ్డుకోలేకపోయింది.
రాజ్‌కోట్: మూడో టైటిల్‌పై కన్నేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్ పదో సీజన్‌ను ఘనంగా ఆరంభించింది. క్రిస్ లిన్ (41 బంతుల్లో 93 నాటౌట్; 6 ఫోర్లు, 8 సిక్సర్లు), కెప్టెన్ గంభీర్ (48 బంతుల్లో 76 నాటౌట్; 12 ఫోర్లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో… శుక్రవారం ఎస్‌సీఏ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) 10 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్‌ను చిత్తు చేసింది. జట్టు కూర్పులో నాణ్యమైన ఆల్‌రౌండర్ లేకపోవడం లయన్స్‌ను దెబ్బతీసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 183 పరుగులు చేసింది.
కెప్టెన్ సురేశ్ రైనా (51 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు), దినేశ్ కార్తీక్ (25 బంతుల్లో 47; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడారు. ఈ జోడి మధ్య నాలుగో వికెట్‌కు 87 పరుగులు జత చేరాయి. ఓపెనర్ మెకల్లమ్ (24 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించాడు. కుల్దీప్ యాదవ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 14.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 184 పరుగులు చేసి నెగ్గింది. లిన్, గంభీర్ తమ విజృంభణతో జట్టుకు ఏ వికెట్‌కైనా అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లిన్‌కు దక్కింది.