కోల్ ఇండియాకు రద్దు చేసిన బొగ్గు గనులు

6xtui8hbకేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన మూడు బొగ్గుగనులను కోల్ ఇండియాకు కేటాయించింది. కార్టలైజేషన్ కు పాల్పడినందుకుగాను జిందాల్ స్టీల్ పవర్ లిమిటెడ్ (జేఎస్పీఎల్), బాల్కోలకు కేటాయించిన మూడు గనులను రద్దు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. సీఐఎల్ కు కేటాయించిన బొగ్గు గనుల్లో గారే పాల్మా IV/1, IV/2, IV/3 ఉన్నాయి. దీంట్లో జిందాల్ పవర్ గారే IV/2, గారే పాల్మా IV/3 దక్కించుకోగా, భారత్ అల్యూమినియం కంపెనీ తారా కోల్ బ్లాక్ను అధిక బిడ్డింగ్ ధరకు కైవసం చేసుకున్నాయి. ఈ మూడు గనుల్లో 313.68 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అంచనా. రెండు దఫాలుగా నిర్వహించిన వేలం పాటలో 33 గనులు అమ్ముడవడంతో ఖజానాకు రూ.2 లక్షల కోట్లకు పైగా ఆదాయం సమకూరనున్నది. అటు బొగ్గు గనులను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా జిందాల్ పవర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రద్దు చేసిన క్షేత్రాలను అత్యవసరంగా కోల్ ఇండియాకు అప్పజెప్పడంతో సంస్థ అభ్యంతరం తెలిపింది. దీనిపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.