కోళ్ల ఫారాల లాగా గొర్ల ఫారాలు అభివృద్ది చెందాలి

మెదక్‌,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): గొల్ల, కురుమలను ధనవంతులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల సహకార అభివృద్ధి సమాఖ్య ఛైర్మన్‌ కన్నెబోయిన రాజయ్య యాదవ్‌ అన్నారు. గొల్ల కురుమల సంక్షేమానికి రూ.10 వేల కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు  చెప్పారు.కోళ్లఫాంల్లానే గొర్రెలఫాంలు అభివృద్ధి చెందాలన్నారు. ఇంజ్రాయిల్‌లో 50 కిలోల వరకు గొర్రెలను పెంచుతారని, ఇతర రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకొని మన రాష్ట్రంలో గొల్ల, కురుమలు అభివృద్ధిచెంది ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని సూచించారు.  ఇప్పటి వరకు సిఎం కెసిఆర్‌ తీసుకున్న నిర్ణయంతో అనేకమంది యాదవులు స్వయం సమృద్ది సాధించడంతో పాటు, గొర్రెల ఉత్తపత్తి కూడా పెరిగిందని అన్నారు.  సబ్సిడీ గొర్రెల పథకానికి లబ్దిదారులకు ఎంతో భరోసా కలిగించిందని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 7.60 లక్షల మంది లబ్దిదారులు ఉన్నారని, ఇప్పటివరకు 3.55 లక్షల మంది లబ్దిదారులకు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ఈ పథకం రాజకీయాలకు అతీతంగా నిత్యం అమలవుతుందన్నారు. రోజూ 650 లారీలపై మాంస ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, ఇందులో 450 లారీలు హైదరాబాద్‌కే వెళ్తున్నాయన్నారు.