కోహ్లీ సవాలును స్వీకరించిన మోదీ
దిల్లీ: భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ… ప్రధాని నరేంద్ర మోదీకి ఫిట్నెస్ ఛాలెంజ్ విసిరాడు. ఈ సవాలును మోదీ కూడా స్వీకరించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన వీడియోను పంచుకుంటానని చెప్పారు. రెండు రోజుల క్రితం కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ‘హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్’ అనే ఛాలెంజ్‌లో ఆయన స్వయంగా పుషప్స్ చేస్తున్న వీడియోను ట్విటర్లో పోస్టు చేశారు.
విరాట్ కోహ్లీ, సైనా నెహ్వాల్, హృతిక్ రోషన్ ఈ ఫిట్నెస్ సవాలును స్వీకరించారు. ఈ నేపథ్యంలో సైనా, హృతిక్ రోషన్ ఇప్పటికే ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి మరికొందరికి ఈ సవాలును విసిరారు. తాజాగా కోహ్లీ కూడా రాథోడ్ సవాలును స్వీకరించాడు. ఫిట్‌గా ఉండేందుకు చేస్తున్న కసరత్తులకు సంబంధించిన వీడియోను పోస్టు చేసిన కోహ్లీ తన భార్య అనుష్క శర్మ, ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెటర్ మహేంద్ర సింగ్ధోనీ ఈ సవాలును స్వీకరించాల్సిందిగా కోరాడు. కోహ్లీ సవాలుకు ప్రధాని మోదీ స్పందించారు. ‘నీ సవాలును స్వీకరిస్తున్నాను. త్వరలోనే నా ఫిట్నెస్ ఛాలెంజ్ వీడియోను పంచుకుంటాను’ అని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు.
భారతీయులంతా ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో రాథోడ్ ‘హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్’ పేరిట ఈ ఛాలెంజ్‌ను మొదలుపెట్టారు. నెటిజన్లు కూడా తమ మిత్రులకు సవాలు విసరాలని సూచించారు.