‘కోహ్లీ’ సేన దిగ్విజయం
శ్రీలంకపై 5-0తో వన్డే సిరీస్ కైవసం
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీ, కేదార్‌జాదవ్ అర్ధసెంచరీతో రాణించడంతో చివరి మ్యాచ్‌లో సైతం భారత్ సునాయసంగా గెలుపొందింది. లంక నిర్ధేశించిన 239 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. రాక రాక వచ్చిన అవకాశాన్ని రహానే(5) సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
రోహిత్ శర్మ(16) కూడా త్వరగా అవుటవ్వడంతో క్రీజులో ఉన్న కోహ్లి, పాండేతో ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 99 పరుగులు జోడించిననంతరం పాండే అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కేదార్ జాదవ్ ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో కోహ్లికి అండగా నిలిచాడు. ఈ దశలో 107 బంతుల్లో 8 ఫోర్లతో కెరీర్‌లో 30 వ సెంచరీ సాధించిన కోహ్లి వన్డేల్లోఅత్యధికంగా సెంచరీలు సాధించిన రెండో బ్యాట్స్‌మన్ పాటింగ్(30) సరసన చేరాడు. ఇక రెండు పరుగుల విజయ దూరంలో ఉండగా జాదవ్ అవుటవ్వడంతో ధోని క్రీజులోకి వచ్చాడు. చెరో సింగిల్‌తో మ్యాచ్ భారత్ వశమైంది. ఇక లంక బౌలర్లలో మలింగ, పుష్పకుమార, డిసిల్వా, ఫెర్నాండోలు తలో వికెట్ తీశారు.
భువీ విజృంభణ..
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంకపై భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ విజృంభించాడు. పదునైన బంతులతో చెలరేగి పోయిన భువీ ఐదు వికెట్లతో లంక పతనాన్ని శాసించాడు. భువనేశ్వర్ దెబ్బకు లంక 49.4 ఓవర్లలో 238 పరుగులకు కుప్పకూలింది. భువీకి జతగా బూమ్రా రెండు వికెట్లతో మెరవడంతో లంక సాధారణ స్కోరుకే పరిమితమైంది. స్పిన్నర్లు కుల్దీప్, చాహల్ కు తలో వికెట్ దక్కింది.