కౌలురైతులను అక్కున చేర్చుకునే యత్నంలో విపక్షాలు
ప్రచారంలో దీనిని హైలెట్ చేసేయోచనలో కాంగ్రెస్
హైదరాబాద్,నవంబర్3(జనంసాక్షి): కౌలురైతులకు రైతుబంధు పంటపెట్టుబడి పథకం అమలు చేయడం సాధ్యం కాదని సిఎం పదేపదే చెబుతూ వస్తున్నారు. రైతుసమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేశారు. దీంతో కైలు రైతులను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో విపక్షాలు వారిని ఆదుకోవాలన్న డిమాండ్‌ను తెరపైకి తుచ్చారు. వారికి పెట్టుబడి సాయంతో
పాటు, బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో ఇప్పుడు కాంగ్రెస్ దీనిని ప్రదాన అంశంగా చేసుకోబోతున్నది. కౌలు రైతులకు అన్యాయం జరిగిందన్న కోణంలో ప్రచారం చేయనున్నారు. తెలంగాణ జనసమితి నేత కోదండరామ్ సహా బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కౌలురైతులకు అండగా నిలుస్తున్నారు. మరో అడుగు ముందుకు వేసి రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటూ పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ ప్రకటించారు. కౌలురైతుల్లో 90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉంటారని, వారిని ఆదుకోవడానికి తాము ముందుకు వస్తామని పిసిసి చీప్ ఉత్తమ్ ప్రకటించారు.అయితే ఇవన్నీ కూడా ఆ రెండు పార్టీలు అధికారంలోకి వస్తేనే సాధ్యం కాగలవు. రాష్ట్రంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయాలంటే రెండేండ్లపాటు ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వడం సాధ్యం కాదని అధికార పార్టీ అంటోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేస్తే తప్ప ఇది సాధ్యం కాదంటున్నారు. జాతీయ పార్టీలు విధానాలను జాతీయస్థాయిలో ప్రకటించాలని, రాష్ట్రానికి, జిల్లాలకు వేర్వేరుగా ప్రకటనలు చేయడం దిగజారుడుతనమే అంటున్నారు. మొత్తంగా ఇప్పుడు అధికరా పార్టీ రైతు సంక్షేమాన్ని సవాల్ చేసేలా విపక్ష పార్టీలు ప్రకటనలు గుప్పిస్తున్నాయి. కౌలురైతుల్లో చాలామందికి కొద్దోగొప్పో వ్యవసాయ భూమి ఉందని, వారే ఇంకొంత భూమి కౌలుకు తీసుకొని పనిచేస్తున్నారని గుత్త సుఖేందర్ రెడ్డి వాదిస్తున్నారు. ఎంత వ్యవసాయ భూమి ఉన్నా అటువంటి వారందరికీ రైతు జీవితబీమా వర్తిస్తుందన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు జరుగుతున్నాయని
, అక్కడ బిజెపి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, వారిని ఎందుకు ఆదుకోవడం లేదని గుత్తా ప్రశస్తున్నారు. కానీ తెలంగాణలో అటువంటి పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం ఎంతో మేలు చేస్తున్నారని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని, రైతుబంధు వంటి పథకాలు రూపొందించారని, ఉచిత కరెంటు ఇస్తున్నారని వివరించారు. వీటన్నిటి వల్ల రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. రైతులకు సాయం చేసేందుకు, వారిని సంఘటితం చేసేందుకు 1.61 లక్షల మందితో రైతు సమన్వయ సమితుల సైన్యం ఏర్పాటైందని గుత్తా పేర్కొన్నారు. ప్రతిపక్షాలు రైతుబంధు పథకంపై గోల చేస్తున్నారని మండిపడ్డారు. అయితే కాంగ్రెస్ పార్టీకి తోడన్నట్లుగా ఇప్పుడు రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించారు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ రెండు ప్రకటనలు ఓ రకంగా అధికరా టిఆర్‌ఎస్‌ను కొంత ఇబ్బందుల్లోకి నెట్టిందనే చెప్పాలి.