క్యాన్సర్‌ బాధితులకు విరాళంగా జుట్టు

ఓ పదహారు నెలల చిన్నారి పెద్ద మనసు
హైదరాబాద్‌,అగస్టు7(జనంసాక్షి): నగరానికి చెందిన 16 నెలల చిన్నారి క్యాన్సర్‌ బాధితుల సహాయార్థం తన జుట్టును దానం చేసింది. సైరా జువెంటాస్‌. హైదరాబాద్‌కు చెందిన ఈ చిన్నారి యువ క్యాన్సర్‌ బాధితుల సహాయార్థం తన పొడవైన, మందంగా ఉన్న జుట్టును దానం చేసింది. నగరం నుండి జుట్టును దానం చేసిన అతి పిన్న వయస్కులలో సైరా ఒకరు. ఆమె తల్లి జెరూషా డోర్కాస్‌. తన కుమార్తె జుట్టును క్యాన్సర్‌ బాధితుల కోసం పనిచేసే హైదరాబాద్‌ హెయిర్‌ డొనేషన్‌ ఫౌండేషన్‌కు ఇచ్చింది. ఈ సందర్బంగా తల్లి జెరూషా మాట్లాడుతూ.. క్యాన్సర్‌ చికిత్సలో కీమోథెరపీ కారణంగా చిన్నారులతో సహా ఎంతోమంది రోగులు తమ జుట్టును కోల్పోతున్న సంగతి తెలిసిందేనన్నారు. అటువంటి వారి కోసం నా కూతురు జుట్టును దానం చేయదలచుకున్నా. సైరా జుట్టు తొందర్లోనే తిరిగి వస్తుంది. కానీ తను ఇచ్చిన జుట్టు ఓ క్యాన్సర్‌ రోగి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తమ జుట్టును కోల్పోయామన్న ట్రామా నుంచి బయటపడేలా ఉపకరిస్తుందన్నారు. జెరూషా సైతం ఇప్పటికే తన జుట్టును మూడు సార్లు దానం చేసింది. సైరా చర్యతో మరికొంతమంది ప్రేరణ పొందుతారని తాను
ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. దేశంలో పెరుగుతున్న క్యాన్సర్‌ కేసులతో జుట్టు దాతలు, విగ్‌ల కోసం స్పాన్సర్‌ల అవసరం చాలా ఉంది.