క్రమబద్ధీకరణకు హైకోర్టు బ్రేక్‌

1

హైదరాబాద్‌,డిసెంబర్‌ 22(జనంసాక్షి): క్రమబద్ధీకరణ ప్రక్రియకు హైకోర్టు బ్రేక్‌ వేసింది. జంట నగరాల పరిధిలో ఉన్న పలు భవనాల క్రమబద్ధీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బీఆర్‌ఎస్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ల ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎలాంటి క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టవద్దంటూ వెల్లడించింది. దీంతో ఒక్కసారిగా జంట నగరాల పరిధిలోని ఇళ్ల యజమానులు షాక్‌ తిన్నారు. ఇప్పటివరకు వేలాది సంఖ్యలో ఇళ్ల యజమానులు తమ దరఖాస్తులు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే జీహెచ్‌ఎంసీ సర్టిఫైడ్‌ ఇంజనీర్లు మాత్రమే ముందుగా భవనాల కొలతలు తీసుకుని, అందులో ఎంత మేర అతిక్రమణలు ఉన్నాయన్నది నిర్ధారించి, ఫైళ్లను అప్‌లోడ్‌ చేయాలని నిబంధన విధించడంతో ఇప్పటికే ఇంజనీరింగ్‌ సంస్థలు, ఆర్కిటెక్టులు భారీ మొత్తంలో ఇళ్ల యజమానుల నుంచి వసూళ్లు చేస్తున్నారు. కేవలం గ్రౌండ్‌ ఫ్లోర్‌ మాత్రమే ఉన్న ఇళ్లకు రూ. 10వేలు, జి+1 ఇళ్లకు రూ. 15 వేల వంతున కేవలం అంచనా వేసి ఇచ్చి, ఫైళ్లు అప్‌లోడ్‌ చేసేందుకు వసూలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో హైకోర్టు బ్రేక్‌ వేయడంతో ఇటు ఇళ్ల యజమానులకు కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది. ఇక దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాల్సిందే. గత అక్టోబర్‌లోనే దీనికి అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వగా దానికి సంబంధించి ఇప్పటికే జీహెచ్‌ఎంసీకి మొత్తం 25 వేలకు పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. అయితే, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు తాము అడ్డు చెప్పబోమని, క్రమబద్ధీకరణ మాత్రం తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు చేపట్టవద్దని హైకోర్టు స్పష్టం చేసింది.