క్రికెట్ ఆస్టేల్రియా సీఈవో రాజీనామా..!
ఇదే మంచి సమయమన్న సుథర్‌లాండ్
సిడ్నీ,జూన్6(జనం సాక్షి): క్రికెట్ ఆస్టేల్రియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సుథర్‌లాండ్ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన పదవి నుంచి త్వరలో తప్పుకోనున్నట్లు ప్రకటించడంతో ఆసీస్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా సుథర్ లాండ్ మాట్లాడుతూ.. క్రికెట్ ఆస్టేల్రియాలో 20ఏళ్ల పాటు పనిచేసిన తరువాత ఇదే సరైన సమయం అనుకుంటున్నా. నేను చాలా సంతృప్తికరంగానే ఉన్నా. నేను దిగిపోవడానికి ఇదే సరైన సమయం, మరోవైపు ఆటకు కూడా ఇదే మంచి తరుణం అని సుథర్ లాండ్ చెప్పారు. గత 12నెలల్లో ఆస్టేల్రియా క్రికెట్లో వ్యూహాత్మకంగా ఎన్నో కీలక సంస్కరణలు తీసుకొచ్చామని, ఆస్టేల్రియా క్రికెటర్ల అసోసియేషన్(ఏసీఏ) పురుషులు, మహిళల క్రికెటర్లతో అవగాహన ఒప్పందంతో అనిశ్చితి తొలగిందన్నారు. కొత్త దేశీయ ప్రసార హక్కుల ఒప్పందం టీవీ కవరేజ్‌ను పెంచిందన్నారు. ఇలాంటి సంస్కరణలు అమల్లోకి రావడంతో నా బాధ్యతలు మరో సీఈవోకు అప్పగించడానికి ఇదే మంచి సమయమని భావిస్తున్నానని సుథర్‌లాండ్ చెప్పారు. గత 20ఏళ్లుగా ఆసీస్ క్రికెట్లో కొనసాగడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. మరికొన్ని నెలల పాటు ఆఫీస్‌లో ఉన్నన్ని రోజులు ఇదే విధంగా సేవచేయాలనుకుంటున్నాని ఆయన వివరించారు. తొలుత 1998లో ఆస్టేల్రియా క్రికెట్‌లో అడుగుపెట్టారు. అనంతరం తక్కువ కాలంలోనే 2001లో సీఈవోగా నియమితులయ్యారు. ఐతే సుథర్ లాండ్ 12 నెలల నోటీస్ పీరియడ్ ఇచ్చారు. ఈలోగా సీఈవోగా సరైన వ్యక్తిని నియమించే వరకు సుథర్ లాండ్ సీఈవోగా కొనసాగనున్నారు.