ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తాం

1

: మంత్రి హరీశ్‌

ఖమ్మం,ఆగస్ట్‌19(జనంసాక్షి):

ఖమ్మం జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలంగాణ నీటిపారుదశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. జిల్లాలో నీటిపారుదల కోసం ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు. ఎత్తిపోతల పథకాలను కాలువల కిందికి తీసుకొస్తామన్నారు. ఇక్కడ భూగర్భ జలాలు కూడా అందుబాటులో ఉన్నాయని అన్నారు. మిషన్‌ కాకతీయద్వారా మంచి ఫలితాలు వచ్చాయన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరావుతో కలసి అయన విూడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వాలు ఆచరణ సాధ్యం కాని పథకాలు ప్రవేశపెట్టి ప్రజాధనాన్ని వృథా చేశాయని మంత్రి విమర్శించారు.  జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులపై 10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని  తెలిపారు. గత ప్రభుత్వం కాంట్రాక్టర్ల కోసమే రాజీవ్‌సాగర్‌, ఇందిరాసాగర్‌ ప్రాజెక్టులు ప్రారంభించిందని ఆరోపించారు. జిల్లాలో సమగ్ర ప్రణాళికలతో సాగునీరు అందిస్తామని అన్నారు.  తెలంగాణలో మిషన్‌ కాకతీయ అద్భుత ఫలితాలు ఇస్తుందని హరీష్‌రావు స్పష్టం చేశారు.  ఖమ్మం జిల్లాలో మిషన్‌ కాకతీయ పూర్తి స్థాయిలో విజయవంతమైందని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో చెరువులు నిండాయన్నారు.  జిల్లాలోని కరువు ప్రాంతాలను తాగునీటి అవసరాలు తీరుస్తామని చెప్పారు. ప్రతీ జిల్లాలోని విశ్రాంత ఇంజినీర్లు, ప్రస్తుత ఇంజినీర్లతో కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి జిల్లాకు నీరు ఇవ్వగలిగే ఆయకట్టు వివరాలు సేకరిస్తున్నామని స్పష్టం చేశారు. నెల రోజుల్లో స్పష్టమైన అవగాహనకు వచ్చి నీరు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఇదిలావుంటే ఖమ్మంలో ప్రపంచ ఫొటోగ్రఫీ వేడుకలు బుధవారం నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై సీనియర్‌ ఫొటోగ్రాఫర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిత్రాలు అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి.