ఖమ్మం డిగ్రీ కళాశాల మైదానంలో 19న కెసిఆర్‌ సభ

ఏర్పాట్లలో నిమగ్నమైన నేతలు

పదికిపది సీట్లు గెలుస్తామన్న మంత్రి తుమ్మల

కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరనున్న పలువురు

ఖమ్మం,నవంబర్‌17(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ ఖమ్మం పర్యటన ఖరారు కావడంతో నేతలు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గులాబీ దళపతి 19న ఖమ్మానికి రానున్నారు. సీఎం పర్యటన ఖరారు కావడంతో ఆ పార్టీ నాయకుల్లో జోష్‌ నిండింది. దీంతో ఏర్పాటు పనుల్లో మంత్రి తుమ్మల నిమగ్నమయ్యారు. కేసీఆర్‌ పర్యటనకు అవసరమైన కార్యాచరణపై రేపుట్నుంచి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లాలోని టీఆర్‌ఎస్‌ పార్టీ అన్ని నియోజకవర్గాల అభ్యర్థులను కలుపుకొని ఏర్పాట్లలో నిమగ్నం కానున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లతో పాటు అభ్యర్థుల నామినేషన్‌ కార్యక్రమం కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఒకరిద్దరు మంత్రులు, పలువురు పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు సైతం హాజరుకానున్నారు.పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల అభ్యర్థులు తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్‌కుమార్‌ చేత 19న మధ్యాహ్నం 1.30గంటలకు శుభ ముహూర్తాన నామినేషన్‌ దాఖలు చేయిస్తారు. అనంతరం 2.00గంటలకు ఖమ్మం నగరం డిగ్రీ కళాశాల గ్రౌండ్‌లో జరిగే భారీ బహిరంగసభకు హాజరై ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన కొందరు ముఖ్య నాయకులు కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ విజయానికి దోహదపడతాయని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెలిచి తీరుతామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన 24గంటల ఉచిత విద్యుత్‌, రైతుబంధు, బీమా, గొర్రెలు, చేపలు పంపిణీల ద్వారా రైతులు, కుల సంఘాల్లో ఆత్మైస్థెర్యం నెలకొందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ద్వారా రూ.1.16లక్షలు అందిస్తూ వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. ఇక సిఎం రానుండడంతో ఉమ్మడి ఖమ్మంలో ఎన్నికల వేడి కాకెక్కింది. రోజుకో మలుపు తిరుగుతున్న రాజకీయాలతో ఆయా పార్టీల అధిష్ఠానాలను చెమటలు పట్టిస్తున్నాయి.