ఖమ్మం సభకు దేశవ్యాప్త ప్రాధాన్యం


– 28న ఖమ్మంలో జరిగే సభలో రాహుల్‌, చంద్రబాబు పాల్గొంటారు
– మతతత్వ బీజేపీని తరిమేందుకు శంఖారావం పూరిస్తారు
– ప్రజాకూటమి నేతలందరినీ ఆహ్వానిస్తున్నాం
– ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలి
– కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌ భట్టి విక్రమార్క
– భాజపాయేతర పార్టీలన్నీ కలిసిరావాలి
– ఖమ్మం కూటమి అభ్యర్ధి నామా నాగేశ్వరరావు
ఖమ్మం, నవంబర్‌26(జ‌నంసాక్షి) : ఈనెల 28న ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఏపీ సీఎం, టీటీపీ అధినేత చంద్రబాబు నాయుడులు పాల్గొంటున్నారని, ఈ సభకు దేశవ్యాప్త ప్రాధాన్యత నెలకొందని కాంగ్రెస్‌ పార్టీ ప్రచాక కమిటీ చైర్మన్‌, మధిర నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్ధి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 28న జరిగే బహిరంగ సభ వేదికను ఖమ్మం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నామా నాగేశ్వరరావుతో కలిసి భట్టి విక్రమార్క సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రజాకూటమిలో భాగస్వాములైనటువంటి అగ్రనేతలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాంతో పాటు ప్రజా సంఘాల నేతలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సభ నుంచి రాష్ట్రానికే కాదు దేశానికి కూడా దశాదిశ నిర్దేశం చేయబోతున్నట్లు తెలిపారు. దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, మతత్వ వాదంతో, దేశంలో ఉన్నటువంటి ఆర్ధిక, రాజకీయ వ్యవస్థలను చిన్నాభిన్నంగా చేస్తున్నటువంటి నరేంద్ర మోడీపాలన,
మోడీ పాలనతో నష్టాలు, దాని నుంచి దేశాన్ని తప్పించడానికి, ఈ జాతి నిర్మాణం కోసం ఇక్కడ నుండి బీజేపీ యేతర పార్టీలనేతలందరికీ సందేశాన్ని ఈ సభనుంచి ఇవ్వబోతున్నట్లు తెలిపారు. 28న జరిగే ఈ సభకు ప్రజా కూటమి పార్టీలోని అభిమానులందరి సభలో పాల్గొని జయప్రదం చేయాలని భట్టి కోరారు.  నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణలో తప్పకుండా ప్రజాకూటమి ప్రభుత్వంరావడం తధ్యమని  అన్నారు.  ఈనెల 28న కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌, తెదేపా అధినేత చంద్రబాబులు ఒకే సభలో పాల్గోబోతున్నారని, ఇందుకు ఖమ్మం జిల్లా వేదిక కావటం అనేది చాలా సంతోషకరమైన విషయమన్నారు. ఖమ్మం జిల్లా పోరాట గడ్డ అని, ఇక్కడ నుండి ఇరువురు అగ్రనేతలు ఇచ్చే సందేశం కోసం దేశంమొత్తం ఎదురు చూస్తుందని తెలిపారు. ప్రజాకూటమి నేతలందరినీ ఆహ్వానిస్తున్నామని తెలిపారు. లౌకికవాదాన్ని కాపాడుకోవడానికి భాజపాయేతర పార్టీలన్నీ కలిసి రావాలని నామా నాగేశ్వరావు పిలుపునిచ్చారు.