ఖమ్మం సభ ఒక చారిత్రక ఘట్టం


-దేశ సమైక్యత కోసం కాంగ్రెస్‌, టీడీపీలు చేతులు కలిపాయి
– రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓటమి ఖాయం
– కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ భట్టి విక్రమార్క
ఖమ్మం, నవంబర్‌ 28(జనంసాక్షి) : రాహుల్‌ గాంధీ, చంద్రబాబుల కలయికతో ఖమ్మం సభ చారిత్రక ఘట్టానికి వేదికైందని కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌ భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.. కాంగ్రెస్‌, టీడీపీల కలయిక అపవిత్రమని టీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోందని.. తమది అపవిత్ర కలయిక కాదని, దేశ ప్రయోజనాల కోసమే తాము ఒక్కటయ్యామనిభట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు  అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య కార్యాలయానికి స్వయంగా వెళ్లి లేఖ ఇచ్చారని చెప్పారు. ప్రధాని మోదీ దేశాన్ని మతాలు, కులాల పేరిట విడగొడుతున్నారని మండిపడ్డారు. అందుకే దేశ సమైక్యత కోసం తామంతా ఏక తాటిపైకి వచ్చామని, ఇదొక చారిత్రక ఘట్టమని చెప్పారు. ఖమ్మంకు రాహుల్‌, చంద్రబాబులను సాదరంగా ఆహ్వానిస్తున్నామని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఓడిపోనుందని… ప్రజాప్రభుత్వం ఏర్పడనుందని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని స్థానాలను మహాకూటమి కైవసం చేసుకోబోతోందని ధీమా వ్యక్తం చేశారు.