ఖరీఫ్‌లో కౌలు రైతులకూ రుణాలు!
శ్రీకాకుళం, జూన్ 27 : ఈ ఏడాది ఖరీఫ్ పంటకు కౌలు రైతులు అందరికీ పంట రుణాలు మంజూరు చేయనున్నట్టు జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఆర్.ఎస్.రాజకుమార్ తెలిపారు. తహసీల్దార్లు, రైతు సంఘాల నాయకులతో బుధవారంనాడు ఆయన కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కౌలు రైతులకు పంట రుణాలు మంజూరు చేయాలన్నారు. జిల్లాలోని కౌలు రైతులను గుర్తించాలన్నారు. గుర్తించిన వారికి కార్డులు మంజూరు చేయాలని సూచించారు. ఇన్‌పుట్ సబ్సిడీ అందజేసేందుకు రైతులతో బ్యాంకు ఖాతాలు తెరిపించాలని కోరారు. వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు మాట్లాడుతూ జిల్లాలో 55,398 క్వింటాళ్ల వరి విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. మండల స్థాయిలో 32వేల క్వింటాళ్లు నిల్వ ఉన్నట్టు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి లారీల ద్వారా రోజుకు 1500 క్వింటాళ్లు తెప్పిస్తున్నామన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించేందుకు జూన్ 30 వరకు గడువు ఉందన్నారు. ఈలోగా రైతులు బ్యాంకుల్లో ఖాతాలు తెరవాలని సూచించారు. కెఆర్‌సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ధనుంజయరావు, శ్రీకాకుళం ఆర్డీవో దామోదరరావు, టెక్కలి ఆర్డీవో వి.విశ్వేశ్వరరావు, మండల తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఎస్.మురళీకృష్ణారావు, రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.