ఖలీదాజియా అక్రమ సోమ్ము వెనక్కి
ఢాకా, నవంబర్23: మాజీ ప్రధాని ఖలీదాజియా చిన్న కుమారుడు అరాఫత్ రెహ్మాన్ అక్రమంగా సింగపూర్ తరలించిన సుమారు రూపాయలు 8 కోట్లు బంగ్లాదేశ్ నుంచి తిరిగి రాబట్టింది. 2001-06 మధ్య బీఎస్‌పీ ప్రభుత్వ హయాంలో అరాఫత్ అక్రమంగా తరలించిన ఈ డబ్బును సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందంలో భాగంగా వెనక్కి రప్పించిగలిగినట్లు బంగ్లాదేశ్ అవినీతి వ్యతిరేక కమిషన్(ఏసీసీ) చైర్మన్ గులాం రెహ్మాన్ తెలిపారు. విదేశాలకు తరలిన అక్రమ సొమ్మును ఇలా వెనక్కి రప్పించడం ఇదే ప్రధమమని చెప్పారు. రూపాయలు 20 కోట్ల సొమ్మును విదేశాలకు అక్రమంగా తరలించిన కేసులో అరాఫత్‌కు ఐదు నెలల కిందటే ఢాకా కోర్టు ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టుకు హాజరుకాని అరాఫత్‌ను పరారీలో ఉన్న నిందితునిగా పేర్కొంది. 2007లోనే ఒక కేసులో అరెస్టైన అరాఫత్..అనారోగ్య కారణాల రీత్యా పెరోల్‌పై విడుదలై ప్రస్తుతం బ్యాంకాక్‌లో నివసిస్తున్నాడు.