ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి : జెఎసి డిమాండ్‌

కడప, జూలై 20: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల కార్యాచరణ కమిటీ జెఎసి డిమాండ్‌ చేసింది. సమితి పిలుపుమేరకు కలెక్టరేట్‌లో శుక్రవారం నాడు భోజన విరామ సమయంలో ఆందోళన చేపట్టారు. జెఎసి కన్వీనర్‌ శివారెడ్డి మాట్లాడుతూ, తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో అనేక మార్లు చర్చలు జరిపామని అన్నారు. ప్రభుత్వం ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తోందని అన్నారు. అందు కోసమే ఆందోళన చేపట్టామని స్పష్టం చేశారు. 10వ పిఆర్‌సి అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు క్యాష్‌లెస్‌ హెల్త్‌ కార్డులు ఇవ్వాలని కోరారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, కంటింజెన్స్‌ పేరిట పనిచేసే వారందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వారానికి ఐదు రోజుల పని దినాలు కల్పించాలని అన్నారు. ఈ ఆందోళనలో జెఎసి కో-కన్వీనర్‌ రామ్మూర్తినాయుడు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.