గజదొంగల రాజ్యం వద్దు ఆంధ్రపార్టీలను తరమికొట్టాలి సమరభేరి సభలో కేసీఆర్‌

మా బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నపుడు ఎందుకు మాట్లాడలేదు

సమైక్యాంధ్ర పార్టీలకు కోదండరామ్‌ సూటి ప్రశ్న

సూర్యాపేట : తెలంగాణ ప్రజలకు రాజన్న, చంద్రన్నలాంటి గజదొంగల రాజ్యం వద్దని తెలంగాణ రాజ్యమే కావాలని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. నల్గొండ జిల్లా సూర్యాపేటలో నిర్వహించిన తెలంగాణ సమరభేరి సభలో ఆయన మాట్లాడారు. ఇద్దరు అన్నల పాలనను ఇక్కడి ప్రజలు చూశారని, ఎంతో విసిగిపోయి ఉన్నారని తెలిపారు. ఈ ప్రాంత ఘనులు, నిధులు, నీళ్లు ఉద్యోగాలు దోచుకున్న వారి రాజ్యం మనకు ఇక వద్దని సూచించారు. వారిద్దరి పాలనలో తెలంగాణ ప్రాంతం ఎంతగానో దోపిడీకి గురైందని పేర్కొన్నారు. విశ్వసనీయత గురించి మాట్లాడుతున్న చంద్రబాబుకు అసలు అది ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు. సింగపూర్‌లోనూ, హెరిటేజ్‌ స్టోర్‌లోనో విశ్వసనీయత దొరకదని స్పష్టం చేశారు. బాబు తొమ్మిదేళ్ల పాలనలో రిటైర్మెంట్లే తప్ప రిక్రూట్‌మెంట్లు లేవన్నారు. 2003లో కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయం ఎదుట శివరామమూర్తి అనే వ్యక్తి పింఛన్‌ తగ్గింపునకు నిరసనగా లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. చంద్రబాబు పాదయాత్ర కాదుకదా మోకాళ్లయాత్ర చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. ఇక రాజన్న పాలనలో వెయ్యి మంది రైతులు, ఐదు వందల మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణకు నష్టం కలిగించే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నిర్మాణాన్ని 600 మంది సాయుధ పోలీసులను పెట్టి పూర్తి చేయించారని తెలిపారు. అదే ఎస్‌ఎల్‌బీసీ నిర్మాణాన్ని 40 ఏళ్లుగా ఎందుకు విస్మరిస్తున్నారని నిలదీశారు. జలయజ్ఞంలో కేవలం ఆంధ్రప్రాంత ప్రాజెక్టులు మాత్రమే పూర్తిచేశారని తెలంగాణను సశ్యశ్యామలం చేసే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు శిలాఫలకానికే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులు ఎందుకు పూర్తికావడం లేదని, ఈ ప్రాంత కాంగ్రెస్‌ నాయకులు దీనికి సమాధానం చెప్పాలని కోరారు. కాంగ్రెస్‌ అధిష్టానం ఆహ్వానిస్తేనే చర్చలకు ఢిల్లీకి వెళ్లామని తెలిపారు. ఎందరో నాయకుల రాజకీయ భవిష్యత్‌ను పణంగా పెట్టి టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని చెప్పినా మోసం చేశారని తెలిపారు. ఇకపై జేఏసీతో కలిసి ఐక్య ఉద్యమాలు చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్రపార్టీలను తరమికొట్టాలని పిలుపునిచ్చారు. అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నామకమ్మన్నట్లు పింఛన్ల పేరుతో మభ్య పెట్టేందుకు ఆంధ్ర పార్టీలు కుయుక్తులు పన్నుతున్నాయని, తెలంగాణ వస్తే వృద్ధాప్య, వితంతు పింఛన్లు రూ. వెయ్యికి, వికలాంగుల పింఛన్‌ రూ. 1500లకు పెంచుతామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 24 జిల్లాలు ఏర్పాటు చేస్తామని, అప్పుడు సూర్యాపేట కూడా జిల్లా అవుతుందని తెలిపారు. అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. సూర్యాపేట సభను చూసైనా కేంద్రానికి కనువిప్పు కలగాలని కోరారు. అంతకుముందు టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మాట్లాడారు. ఆంధ్ర ప్రజల మీద వ్యతిరేకత లేదని, కేవలం ఆ ప్రాంత పార్టీలకు మాత్రమే వ్యతికేమని అన్నారు. ఇప్పుడు పాదయాత్రలు చేస్తున్న నాయకులు మా బిడ్డలు ఆత్మబలిదానాలు చేస్తున్నపుడు ఎందు మాట్లాడలేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆశ, శ్వాస తెలంగాణ మాత్రమే ఇందుకోసం చివరి వరకు పోరాడుతామన్నారు. సమైక్యాంధ్ర పార్టీలకు ఓట్లు సీట్లు మినహా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షపై పట్టింపులేదని, ఆయా పార్టీలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

తాజావార్తలు