గణేష్ ఉత్సవాలను శాంతియుత వాతావరణాలు నిర్వహించుకోవాలి
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
యాదాద్రి భువనగిరి బ్యూరో.
గణేష్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, పర్యావరణానికి తోడ్పడే విధంగా మట్టి విగ్రహాలను పూజించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కోరారు.
శనివారం నాడు జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో శాంతి సంఘ సభ్యులు, అధికారులతో గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై ఆమె సమీక్షించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, పర్యావరణహితమైన మట్టి విగ్రహాలను పూజించాలని కోరారు. శాంతి సంఘ సభ్యులు, అధికారులు పూర్తి సమన్వయంతో గణేష్ ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించాలని కోరారు. శాంతి సంఘ సభ్యులు వాలంటీర్ల ఏర్పాటుతో గణేష్ మండపాల వద్ద, అదే విధంగా నిమజ్జనం రోజున చెరువులలో పూజా సామాగ్రిని వేయకుండా చర్యలు తీసుకోవాలని, పారిశుద్య పరిరక్షణకు తోడ్పడాలని సూచించారు. గణేష్ మండపాల వద్ద విద్యుత్ ఏర్పాట్లు, నిమజ్జనం సాగే రోడ్లపై ప్యాచ్ వర్క్ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శోభాయాత్రలు సాంప్రదాయంగా చేయాలని, భక్తి, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా పాటలను వినియోగించాలని, శోభాయాత్రలో అంబులెన్స్ వాహనాలకు వెంటనే దారి ఇచ్చి వెళ్లేలా చూడాలని, ప్రణాళికాబద్ధంగా శోభాయాత్రలలో వాలంటీర్ల తోడ్పాటుతో శాంతి సంఘ సభ్యులు అధికారులకు సహకరించాలని సూచించారు.జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, పది రోజులపాటు జరిగే గణేష్ ఉత్సవాలలో అధికారులు తమకు కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వహించాలని పారిశుద్య కార్యక్రమాలను ఎప్పటికప్పుడు చేపట్టాలని, మండపాల వద్ద, శోభాయాత్రలలో విద్యుత్ తీగలు తగలకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, నిమజ్జనం రోజున 108, 104 అంబులెన్స్ వాహనాలను ఏర్పాటు చేయాలని, క్రేన్ లను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు.
సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, రెవిన్యూ డివిజనల్ అధికారులు భూపాల్ రెడ్డి, సూరజ్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, శాంతి సంఘ సభ్యులు రామచంద్రయ్య, అశోక్, అక్తర్, జాన్సన్, కృష్ణ, భువనగిరి ఉత్సవ కమిటీ అధ్యక్షులు పట్నం కపిల్, ఉపాధ్యక్షులు ఉడుత భాస్కర్, కిషన్ జీ, కృష్ణ చారి, కొండల, నాగేందర్, నరేష్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.