గతానికి నేటికీ తేడా ఉంది: కవిత
నిజామాబాద్,ఏప్రిల్7(జనంసాక్షి): గత ప్రభుత్వాల హయాంలో నిధులు, నీళ్లు అడిగి తెచ్చుకోవాల్సి వచ్చేదని, ఇప్పుడు అడుగక ముందే ప్రభుత్వం మంజూరు చేస్తున్నదని నిజామబాద్ ఎంపీ కవిత చెప్పారు. స్వరాష్ట్రంలోనే మన సంస్కృతి, పండుగలు, పుణ్యక్షేత్రాలకు గుర్తింపు లభించిందన్నారు. రాష్ట్రంలో ఇతర పార్టీల ప్రభ తగ్గిపోయిందని, నవశకం మొదలైందన్నారు. డబుల్ బెడ్రూంల నిర్మాణాల విషయంలో ప్రజలు ఆసక్తిగా ఉన్నారని, ప్రభుత్వం ఈ ఏడాది 2లక్షల ఇండ్ల నిర్మాణానికి ప్రణాళికరూపొందించిందన్నారు. అన్ని జిల్లాల్లోనూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమానంగా కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో కేవలం గులాబీజెండా మాత్రమే గుబాళిస్తున్నదన్నారు. గత పాలకుల హయాంలో అభివృద్ధి పనుల కోసం రూ.కోటి మంజూరు చేయించుకోలేని పరిస్థితి తెలంగాణ ప్రజాప్రతినిధులదన్నారు. ఈ రోజు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ఎన్ని వేలకోట్ల రూపాయలైన ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నదన్నారు. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమం లో అమరులైనవారి కుటుంబాలను ఆదుకుంటామని ఎంపీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. సాంకేతిక ఇబ్బందులతో పూర్తిస్థాయిలో అమరవీరుల వివరాలు లేకుండాపోయాయన్నారు. అయినప్పటికీ వివరాలు సేకరించి అమరుల కుటుంబాలన్నింటినీ ఆదుకుంటామన్నారు. అమరుల కుటుంబం లో ఇంటికో ఉద్యోగం కల్పించి అండగా నిలుస్తామన్నారు.