గత హావిూలను తుంగలో తొక్కిన అధికార టిఆర్‌ఎస్‌

హావిూలను అమలు చేయని వారిని ఓడించండి

ప్రచారంలో కాంగ్రెస్‌ అభ్యర్థి వనమా పిలుపు

భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్‌21(జ‌నంసాక్షి): గత ఎన్నికల్లో అనేక హావిూలు ఇచ్చి వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా విస్మరించిన సీఎం కేసీఆర్‌ గ్దదె దిగక తప్పదని కొత్తగూడెం కాంగ్రెస్‌ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలల్లో తన కార్యకర్తలతో కలిసి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు,, దళితులకు మూడు ఎకరాల భూమి, ప్రతి ఇంటికి ఉద్యోగం, ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు, కేజీ టు పీజీ ఉచిత నిర్భంద విద్య అందిస్తానని వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. హావిూలను విస్మరించిన ఆ పార్టీ నాయకులకు నేడు ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. తన కుటుంబాన్ని తప్ప రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోని కేసీఆర్‌కు తగిన బుద్ధిచెప్పాలని అన్నారు. ఇదిలావుంటే ప్రజాకూటమి బలపరిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావును 20 నుంచి 25వేల మెజారిటీతో గెలిపించుకుందామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కార్యకర్తలకు, ఓటర్లకు పిలుపునిచ్చారు. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొని ఇక్కడ పార్టీని అభివృద్ధి చేసుకొన్నామని, నేడు ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదని, పోరాట స్ఫూర్తే సీపీఐకి బలమని పేర్కొన్నారు. వనమాకు మద్దతు ఇచ్చినంత మాత్రాన ఆయనపై ఆధారపడబోమని, పోరాటాల బాటను కొనసాగించి ప్రజలకు అండగా నిలబడతామని స్పష్టం చేశారు. నిరుత్సాహంతో ఉన్న కార్యకర్తలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎవరూ ప్రలోభాలకు లొంగవద్దని సూచించారు. తనను గెలిపించాలని వనమా సీపీఐ శ్రేణులను విజ్ఞప్తి చేశారు. ఇకపోతే రాజకీయాల్లో ఎవరూ శాశ్వత మిత్రులు కారు..అదే సందర్భంలో శాశ్వత శత్రువులూ కారనే నానుడికి కొత్తగూడెం నియోజకవర్గం నిదర్శనంగా నిలుస్తోంది. 2014 ఎన్నికల్లో మహాకూటమి తరఫున సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున కోనేరు సత్యనారాయణ (చిన్ని) పోటీలో ఉన్నారు. అదేవిధంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి వనమా వెంకటేశ్వరరావు బరిలో నిలిచారు. వీరందరిపై టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి జలగం వెంకటరావు ఇక్కడినుంచి విజేతగా నిలిచారు. ఈసారి మహాకూటమిలో కాంగ్రెస్‌, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితి ఉండటంతో అన్ని పార్టీలూ మహాకూటమి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రకటించబడిన వనమా వెంకటేశ్వరరావుకు మద్దతు తెలపాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో గత ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోనేరు సత్యనారాయణ, మహాకూటమి సీపీఐ అభ్యర్థిగా నిలిచిన కూనంనేని సాంబశివరావులు కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఉన్న వనమా వెంకటేశ్వరరావుకు సహకరించాల్సి వచ్చింది. మొదట టికెట్లు రాకపోవడంతో చాలా నిరుత్సాహం చెందినప్పటికీ..మహాకూటమి ఐక్యతను కాపాడేందుకు వనమాకు మద్దతు ఇస్తున్నారు. కలిసిపనిచేసేందుకు స్నేహహస్తం చాటారు.