గద్వాల జిల్లాకోసం ఆందోళన ఉధృతం

5

– 44వ జాతీయ రహదారి దిగ్భంధం

మహబూబ్‌నగర్‌,జులై 1(జనంసాక్షి):కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాల్లో గద్వాల పేరు లేకపోవడంతో ఇక్కడ ఆందోళన ఉధృతం అయ్యింది. మాజీమంత్రి డికె అరుణ నాయకత్వంలో ఆందోళన ఉధృతం చేశారు. హైదరాబాద్‌-బెంగళూరు 44వ జాతీయ రహదారిపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. గద్వాల, అలంపూర్‌ ఎమ్మెల్యేలు డి.కె.అరుణ, సంపత్‌కుమార్‌ ఆందోళనకు నాయకత్వం వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. రాత్రి నుంచే ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ విధించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాల ఏర్పాటు పక్రియ ప్రారంభించినప్పటి నుంచి పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాల కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని ఆ ప్రాంతవాసులు తీవ్రంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం కాంగ్రెస్‌ నేతలు 44 వ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ధర్నాలో కాంగ్రెస్‌ నేతలు డీకే అరుణ, సంపత్‌ కుమార్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు. రహదారిపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించడంతో.. పోలీసులు నేతలను అరెస్ట్‌ చేశారు. గద్వాలను జిల్లాగా ప్రకటించాల్సిందేనని నేతలు పట్టుబడుతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గద్వాలను ప్రత్యేక జిల్లా చేయాలంటూ ఆ ప్రాంత వాసులు ఆందోళన బాట పట్టారు. అలంపూర్‌, గద్వాల నియోజకవర్గాల సవిూపంలోని ఎర్రవల్లి చౌరస్తా వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి అరుణ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షల మేరకు గద్వాలను జిల్లా చేయాలన్నారు. ఇక్కడ అన్ని అర్హతుల ఉన్నాయన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామన్న సిఎం కెసిఆర్‌ గద్వాల విషయంలో ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు.