గన్నవరంలో కార్గో సర్వీసులు ప్రారంభం

విజయవాడ,జూన్‌19(జ‌నం సాక్షి ): గన్నవరం విమానాశ్రయం నుంచి కార్గో విమాన సర్వీసులు మంగళవారం ప్రారంభమయ్యాయి. పాత టెర్మినల్‌ భవనంలో శ్రీపా , సుకుమార్‌ లాజిస్టిక్స్‌, కార్గో సర్వీసును రాష్ట్ర న్యాయ, క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, శ్రీపా లాజిస్టిక్స్‌ ఎండీ రామారావు, విమానాశ్రయ డైరెక్టర్‌ మధుసూధనరావు కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గన్నవరం విమానాశ్రయం నుంచి విమాన కార్గో సర్వీసు ద్వారా రోజుకు 10 టన్నుల వస్తువులు ఎగుమతి అవుతాయని తెలిపారు. కార్గో సర్వీసు ద్వారా మామిడి, మిరప, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు, ఆక్వా ఉత్పత్తులు, వస్త్రాలు, ఎగుమతి చేసుకునేందుకు మంచి అవకాశముందన్నారు. భవిష్యత్తులో కార్గో సర్వీసులను మచిలీపట్నం పోర్టుకి అనుసంధానం చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.