గర్జించే మేఘాలు వర్షించవు

న్యూఢిల్లీ, మార్చి 6 (జనంసాక్షి) :
‘గర్జించే మేఘాలు వర్షించవు.. ఎన్‌డీఏ గతంలో రెండు మార్లు ప్రధాని అభ్యర్థిగా ఎల్‌కే అద్వానీని ప్రక్రటించింది అయినా ప్రజలు ఆదరించలేదు. యూపీఏకే అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి ఏదో సాధించాలని అనుకుంటోంది, కానీ ఎన్‌డీఏకు అధికారం ఎప్పటికీ పగటి కలే’ అని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. తన సహజతీరుకు భిన్నంగా మన్మోహన్‌ బుధవారం పార్లమెంట్‌లో ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, గాంధీ కుటుంబం కోసమే ఇదంతా చేస్తున్నారనే మోడీ వ్యాఖ్యలపై మన్మోహన్‌ ఘాటుగా స్పందించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడాల్సిన అవసరం కాంగ్రెస్‌ పార్టీకి లేదని, చవకబారు విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రస్తుత ఖాతాల ద్రవ్యలోటు తాము భావించిన దానికంటే ఎక్కువగానే ఉందని ఆయన అన్నారు. భారత ఆర్థిక వృద్ధి రేటు తగ్గుదల నిలకడగా లేదని, భవిష్యత్‌లో 8 శాతం వృద్ధి సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్థిక వృద్ధి సాధించేందుకు పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని, ఈ ఏడాది వ్యవసాయ రంగ వృద్ధిరేటు 1.8 శాతం కంటే అధికంగా సాధించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీ, బీజేపీ వ్యాఖ్యలను తిప్పికొట్టే సమయంలో ఆగ్రహంగా ప్రస్రంగించిన ప్రధాని తర్వాత కాస్త తేరుకుని ఆర్థిక వృద్ధి పార్లమెంట్‌లో ప్రకటన చేశారు.