గల్లంతైన బీటెక్ విద్యార్థుల మృత దేహాల వెలికితీత
విజయవాడ(జనం సాక్షి ) : పవిత్ర సంగమం వద్ద సెర్చ్ ఆపరేషన్ ముగిసింది. నిన్న గల్లంతైన నలుగురు బీటెక్ విద్యార్థుల మృత దేహాలను వెలికితీశారు. చైతన్య, శ్రీనాథ్, ప్రవీణ్, రాజ్‌కుమార్‌గా గుర్తించారు. మొదట నదిలో మూడు మృత దేహాలే లభ్యమయ్యాయి. కాసేపటి తర్వాత మరో మృత దేహం కనిపించింది. మొదట అది రాజ్ కుమార్ మృత దేహమేనని భావించిన అధికారులు రిస్క్యూ ఆపరేషన్ పూర్తయినట్లు చెప్పారు. తర్వాత ఆ మృత దేహం రాజ్ కుమార్‌ది కాదని, ఎవరో గుర్తు తెలియని వ్యక్తిదని తేలింది. దీంతో మళ్లీ గాలింపు చర్యలు చేపట్టారు. కాసేటి తర్వాత రాజ్ కుమార్ మృత దేహం బయట పడింది. కంచికచర్లలోని ఎమ్మెల్సీ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ద్వీతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు నిన్న పెర్రి ఘాట్ వద్దకు వెళ్లారు. ముందు ఒక విద్యార్థి కృష్ణా నదిలో స్నానం చేయడానికి దిగగా ప్రమాదం శాత్తు లోపలికి జారిపోయాడు. దీన్ని గమనించిన తోటి విద్యార్థులు స్నేహితుడిని కాపాడేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలోనే మిగిలిన ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. విద్యార్థుల కోసం సహాయక బృందాలు నిన్నటి నుంచి గాలింపు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.