గవర్నర్‌తో మంత్రి కేటీఆర్‌ భేటి

5

– తెలంగాణ హబ్‌ ప్రారంభానికి ఆహ్వానం

హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి):

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం సాయంత్రం గవర్నర్‌ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా వచ్చేనెల 7న టీ-హబ్‌ ప్రారంభోత్సవానికి గవర్నర్‌ను ఆహ్వానించారు. టీ-హబ్‌పై గవర్నర్‌ ఆసక్తి కనబరిచారని, టీ-హబ్‌ భాగస్వాములతో చర్చిస్తామని గవర్నర్‌ అన్నట్లు కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొనాలని కూడా  గవర్నర్‌ను కోరినట్లు కేటీఆర్‌ తెలిపారు. సోమవారం గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొంటానని గవర్నర్‌ చెప్పినట్లు మంత్రి వెల్లడించారు. అంతుకు ముందు మంత్రి నల్లగొండ  జిల్లాలోని చింతపల్లి మండలం మెల్వలపల్లిలో గ్రామజ్యోతి కార్యక్రమంలో  కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలు, ప్రభుత్వం ఒక్కటే అన్న భావనను గ్రామజ్యోతి ద్వారా వివరిస్తున్నాం. వాటర్‌గ్రిడ్‌ ద్వారా నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగమన్న చిత్తశుద్ధి, సంకల్పం ఉన్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు కరెంట్‌పై మాట్లాడకుండా కోతలు లేని కరెంట్‌ ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని తెలిపారు. గ్రామజ్యోతి ద్వారా 26 శాఖలను సమన్వయం చేసి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం. జిల్లాలో పవర్‌ఎ/-లాంట్‌ను నెలకొల్పి రాష్ట్రానికి వెలుగుపంచే నల్లగొండ జిల్లా అభివృద్ధి చేస్తున్నం. గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు పెన్షన్లు తీసుకుంటున్న వృద్ధుల ముఖాల్లో సంతోషం చూస్తుంటే గర్వంగా ఉందన్నారు.