గవర్నర్ చేతుల్లోకి కశ్మీర్ పగ్గాలు
ఆమోదం తెలిపిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
జమ్మూలో ఎనిమిదవ సారి గవర్నర్ పాలన
న్యూఢిల్లీ, జూన్20(జనం సాక్షి) : జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన షురూ అయింది. గవర్నర్ పాలనకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ)తో మూడున్నరేండ్ల పాటు సాగిన పొత్తుకు బీజేపీ మంగళవారం గుడ్‌బై చెప్పిన విషయం విదితమే. దీంతో మొహబూబా ముఫ్తీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేనందున కేంద్రపాలన విధించాలని గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా సిఫారసు చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఒక నివేదికను పంపారు. నివేదికను పరిశీలించిన రాష్ట్రపతి కోవింద్.. జమ్మూకశ్మీర్ లో గవర్నర్ పాలనకు ఆమోదం తెలిపారు. మెహబూబా ముఫ్తీ ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరిస్తున్నామని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ నిన్న ఢిల్లీలో ఆకస్మికంగా ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని అదుపు చేసేందుకు అధికార పగ్గాలను గవర్నర్ చేతికి అందించాలని నిర్ణయించామని చెప్పారు. అంతకుముందు బీజేపీ అధిష్ఠానం జమ్ముకశ్మీర్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తమ సభ్యులను అత్యవసరంగా ఢిల్లీకి పిలిపించి సంప్రదింపులు జరిపింది. వారి అభిప్రాయాల మేరకు పీడీపీతో బీజేపీ తెగదెంపులు చేసుకుంది.
ఎనిమిదో సారి గవర్నర్ పాలన..
జమ్మూ కాశ్మీర్‌లో గత 40ఏండ్లలో ఏడుసార్లు గవర్నర్ పాలనలో కొనసాగింది. బుధవారం గవర్నర్ పాలనకు రాష్ట్రప్రతి ఆమోద ముద్ర వేయడంతో ఎమిదవసారి గవర్నర్ పాలనలోకి వెళ్లింది. మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారి అయిన వోహ్రా 2008 జూన్ 25న గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆయన హయాంలో మూడుసార్లు గవర్నర్ పాలన అమలైంది. ప్రస్తుతం రాజీనామా చేసిన ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ తండ్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ (ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే) మృతి చెందిన సమయంలో పీడీపీ, బీజేపీలు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో చివరిసారి 2016 జనవరి 8న గవర్నర్ పాలన విధించారు.
గవర్నర్ పాలనలో మా పని మరింత సులువు – డీజీపీ వైద్
జమ్ముకశ్మీర్‌లో పీడీపీాభాజపా మధ్య పొత్తు వీగిపోవడంతో ఆ రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించారు. గవర్నర్ పాలనకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ ఉదయం ఆమోదముద్ర వేశారు. దీంతో గవర్నర్ పాలన ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. మరోవైపు రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాల నిర్మూలన చర్యలను మరింత ఉద్ధృతం చేస్తామని ఆ రాష్ట్ర డీజీపీ శేషు పాల్ వైద్ తెలిపారు. గవర్నర్ పాలనలో తమ పని మరింత సులభమవుతుందని ఆయన పేర్కొనడం గమనార్హం. రాష్ట్రంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతోందని, కాల్పుల విరమణ ఒప్పందం సమయంలోనే ఇది నిలిచిపోయిందన్నారు. దీన్ని మేం రాబోయే రోజుల్లో మరింత ఉద్ధృతం చేస్తామని తెలిపారు. గవర్నర్ పాలనలో పని చేయడం మరింత సులువని నేను అనుకుంటున్నానని వైద్ తెలిపారు. గవర్నర్ పాలన ప్రభావం ఎలా ఉంటుందని విూడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు.కాల్పుల విరమణ ఉగ్రవాదులకు ఊపిరినిచ్చినట్లైందని డీజీపీ పేర్కొన్నారు. ఈ సమయాన్ని ఉగ్రవాదులు వారికి అనుకూలంగా మార్చుకున్నారని తెలిపారు. కాల్పుల విరమణ సమయంలో ఉగ్రవాదుల కదలికలపై కచ్చితమైన సమాచారం ఉన్నప్పటికీ తాము ఏవిూ చేయలేకపోయామని వివరించారు. అయితే ప్రస్తుతం మాత్రం ఆపరేషన్‌ను మరింత ఉద్ధృతం చేస్తామని చెప్పారు. అలాగే జర్నలిస్టు సుజాత్ బుఖారీ హత్య కేసును కూడా వీలైనంత త్వరగా ఛేదిస్తామని తెలిపారు