గవర్నర్‌ జీ ! చార్మినార్‌ చారిత్రాత్మక కట్టడం రక్షణ కల్పించండి


సియాసత్‌ ఎడిటర్‌ జాహెద్‌ అలీఖాన్‌ హైద్రాబాద్‌, నవంబర్‌29(జనంసాక్షి): హైద్రాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా చారిత్రక నగరంగా గుర్తింపు ఉందని, కావున నగరంలోని చారిత్రక కట్టడాలకు రక్షణ కల్పించాలని శాంతి కమిటీ సభ్యులు సియాసత్‌ ఎడిటర్‌ జాహెద్‌ అలీఖాన్‌ నేతృత్వంలో గురువారం గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. హైద్రాబాద్‌ నగరానికి నాలుగు శతాబ్దాల పైచిలుకు చరిత్ర ఉందని, ఇక్కడి కట్టడాలకు ఎంతో విశిష్టత ఉందన్నారు. హైద్రాబాద్‌ అంటే గుర్తొచ్చేది చార్మినార్‌ కట్టడమేనని కావున దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. చార్మినార్‌ కేంద్రంగా ఇటీవల వివాదాలు ముసురుకున్నందును దానికి రక్షణ కల్పించాలన్నారు. ఐక్యరాజ్యసమితి హెరిటేజి కట్టడాలుగా గుర్తించిన కట్టడాలు నగరంలో ఉన్నాయని కావున వాటికి పటిష్ట రక్షణ కల్పించాలన్నారు. చరిత్రను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, అందుకే వాటికి పటిష్ట రక్షణ కల్పించాలని కోరారు.