గాంధీ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌

రంగంలోకి దిగిన పోలీస్‌ దర్యాప్తు బృందాలు
రేపిస్టుల కోసం ముమ్మర గాలింపు
కఠినంగా శిక్షించాలంటున్న మహిళా సంఘాలు
హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): రాజధాని గాంధీ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకోవడంతో ఇప్పుడు ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకుంది. వెంటనే దోషులను పట్టుకునే పనిలో పోలీసులు రంగంలోకి దిగారు. మంత్రి కెటిఆర్‌ కూడా దీనిపై ఆరా తీసినట్లు సమాచారం. దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిజిపిని కోరినట్లు తెలుస్తోంది. అలాగే దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇంతటి దారుణం జరగడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకన్నా దరుణం ఉండదని ,ఇలాంటి కేసులను ఉపేక్షించరాదని అన్నారు. చికిత్స కోసం వచ్చిన ఓ రోగికి సహాయకులుగా ఉండేందుకు వచ్చిన అక్కాచెల్లెళ్లను అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న రేడియోగ్రాఫర్‌, అతడి స్నేహితులు గదిలో నిర్బంధించి, మత్తుమందిచ్చి వారం రోజులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. తన తల్లి, పిన్ని కనిపించడం లేదంటూ బాధితురాలి కుమారుడు ఓ రేడియోగ్రాఫర్‌ను నిలదీయగా.. ఎక్కడున్నారో చూద్దామంటూ ఆదివారం సాయంత్రం ఆసుపత్రి అంతా కలియతిప్పాడు. ఓ చోట శరీరంపై అరకొర దుస్తులతో అపస్మారక స్థితిలో ఉన్న పిన్ని కనిపించింది. సపర్యలు చేసి ఆమెను మహబూబ్‌నగర్‌కు తీసుకువెళ్లారు. జరిగిన దారుణాన్ని అక్కడ ఆమె వివరించింది. దాంతో సోమవారం స్థానిక పోలీసులకు తెలిపారు. హైదరాబాద్‌లోనే ఫిర్యాదు చేయాలని చెప్పడంతో చిలకలగూడ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇలా వివరాలు వెలుగు చూశాయి. రాజధాని నడిబొడ్డున.. నిత్యం వందలాది మంది రోగులు వచ్చిపోయే గాంధీ ఆస్పత్రిలో.. తనపైన, తన అక్కపైన ఐదారుగురు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడినట్లు ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన బావకు చికిత్స చేయించేందుకు గాంధీ ఆస్పత్రిలో చేర్పించి.. తాను, తన అక్క సహాయకులుగా ఉన్నామని.. అక్కడ తమకు మత్తు మందు ఇచ్చి, ఆస్పత్రి సెల్లార్‌లో ఐదారుగురు లైంగికదాడి చేశారని ఆరోపించింది. వారం పాటు ఆ మహిళలిద్దరూ ఏమయ్యారో అటు ఆస్పత్రిలో ఉన్న పేషెంట్‌కు.. ఇటు ఇంటి దగ్గర ఉన్న కుటుంబసభ్యులకూ తెలియని పరిస్థితి. చివరకు.. అక్క ఆచూకీ గల్లంతు కాగా, చెల్లెలు ఆస్పత్రి వెనుక భాగంలో అపస్మారక స్థితిలో కనిపించింది!! గాంధీ ఆస్పత్రిలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మూత్రపిండాల వ్యాధితో ఈ నెల 5న గాంధీ ఆసుపత్రిలో చేరారు. భార్య, మరదలు ఆయనకు సహాయకులుగా వచ్చారు. కుమారుడు రోజూ ఆసుపత్రికి వచ్చి వెళ్లేవాడు. ఆసుపత్రిలోని రేడియోగ్రాఫర్‌ ఉమామహేశ్వర్‌ ఆ మహిళలకు దూరపు బంధువు కావడంతో వారు అతడితో మాట్లాడేవారు. ఈ నెల 8 నుంచి అక్కాచెల్లెళ్లిద్దరూ కనిపించలేదు. రోగి కుమారుడు (17) వెళ్లి ఉమామహేశ్వర్‌ను అడగ్గా విషయం వెలుగులోకి వచ్చింది. ఉమామహేశ్వర్‌ ఈనెల 8న ఆ మహిళలను ఒక గదికి తీసుకెళ్లి కల్లులో మత్తుమందు కలిపి తాగించాడని తెలుస్తోంది. వారు ఆపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత ఉమామహేశ్వర్‌తో పాటు మరికొందరు వారిపై సామూహికంగా అత్యాచారం చేశారు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. మర్నాడు వారిద్దరినీ సెల్లార్‌లోని చీకటి గదిలోకి తీసుకెళ్లి మరోమారు అఘాయిత్యానికి పాల్పడ్డారు.. అనంతరం నగరంలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న అనంతరం పోలీసులు ఉమామహేశ్వర్‌తో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అత్యాచార బాధితుల్లో మరో బాధితురాలి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడు ఉమామహేశ్వర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. మరికొందరిని కూడా ప్రశ్నించారు. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌
డాక్టర్‌ రాజారావు విచారణకు ఆదేశించారు. అతడితో పాటు మరికొంతమంది రేప్‌ చేసినట్టు బాధితురాలు చెప్పినందున వారిని గుర్తించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిపారు. అలాగే.. బాధితురాలి అక్క ఆచూకీ తెలుసుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. బాధితురాలు విచారణకు సరిగా సహకరించట్లేదని.. ఈ కేసులో కొన్ని అనుమానాలున్నాయని.. తప్పి పోయిన మహిళ ఆచూకీ లభిస్తే మరింత సమాచారం వస్తుందని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా.. ఈ నెల 7 నుంచి 15వ తేదీ దాకా వారిద్దరూ ఎక్కడ ఉన్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గత ఐదు రోజులుగా ఉమామహేశ్వర్‌ విధులకు సరిగ్గా హాజరు కావట్లేదని.. ఒకవేళ వచ్చినా రెండు, మూడుగంటలు పనిచేసి కంగారుగా వెళ్లిపోతున్నాడని, తోటి ఉద్యోగులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. గ్యాంగ్‌రేప్‌పై ఫిర్యాదు చేసినా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయని మహబూబ్‌నగర్‌ వన్‌టౌన్‌ పోలీసులపై బాధితురాలి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఆస్పత్రి ఆర్‌ఎంవోలు, ఇతర వైద్యులతో విచారణకు ఆదేశించారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.