గాజాపై దాడుల్లో 100మందికిపైగా మృతి
గత ఆరురోజులుగా ఇజ్రయిల్ సాగిస్తున్న రాకెట్ దాడుల్లో ఇంతవరకు 100మందికిపైగా అమాయక పౌరులు మరణించారు. వీరిలో పాతికమంది దాకా మహిళలు, పిల్లలే ఉన్నారు. ఆదివారం ఒక్క రోజులోనే ఇజ్రాయిల్ 18 మంది పాలస్తీనీయులను పొట్టన పెట్టుకుంది. దాడులను ఆపమని అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడిని ఖాతరు చేయకుండా రోజురోజుకీ చెలరేగిపోతోంది. గగన తల దాడులకు తోడు భూతల దాడులకు కూడా పూనుకుంటున్నది. గాజాపై దాడులు ఆపి శాంతిని నెలకొల్పాలని ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి చేసింది. పశ్చిమాసియాలో కాల్పుల విరమణకు తొలుత చొరవ తీసుకున్న ఈజిప్టు ఈ అంశంపై చర్చల కోసం జెరూసలెం నుంచి తమ దేశానికి ప్రతినిధి బృందం వచ్చినట్లు వెల్లడించింది. గాజాలో పర్యటిస్తున్న ఈజిప్టు అధ్యక్షుడు మహ్మద్ మోర్సీ తన పర్యటనలో హమాస్ రాజకీయ నేత ఖలీద్ మహాల్, ఇస్లామిక్ జీహాద్ అధిపతి రమదాన్ షల్టా తదితరులతో భేటీ అయ్యారు. అయితే ఈ చర్యలు పూర్తిగా ముగిసిందీ లేనిదీ అధ్యక్ష భవనం తన ప్రకటనలో వెల్లడించలేదు. ఇజ్రాయిల్ తన దురాక్రమణకు తెరదించితే తాముకూడా కాల్పుల విరమణకు సిద్ధమేనని మెషాల్ సన్నిహితుడు ఇజ్జాత్ రిషాక్ ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. గాజాపై దురాక్రమణకు తెరదించడంతో పాటు గాజా నిర్బంధాన్ని ఎత్తివేయాలని పాలస్తీనీయులను టార్గెట్‌గా పెట్టుకొని సాగిస్తున్న దాడులకు స్వస్తిచెప్పాలని డిమాండ్ చేశారు. హమాస్ డిమాండ్‌పై స్పందించిన ఇజ్రాయిల్ ఉప ప్రధాని మోషేయాలాన్ హమాస్ ఇజ్రాయిలీ పౌరులపై రాకెట్ ప్రయోగాలకు స్వస్తి చెబితే తాము కూడా దాడులు నిలిపివేస్తామని ట్విట్టర్‌లో ఒక ట్వీట్‌నుపోస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఇజ్రాయిల్‌కు ఆత్మరక్షణ హక్కు ఉందంటూ సన్నాయి నొక్కులు నొక్కిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గాజా స్లిప్‌లో సైనిక సైనిక చర్యను నివారించేందుకు తాము ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. హమాస్ మెడలువంచేందుకు తాము దాడులు చేస్తున్నామని ఇజ్రాయిల్‌ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తాము అమాయక పౌరులపై దాడులను నివారించేందుకు సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకుంటామని ప్రపంచ దేశాలకు హామీ ఇచ్చారు.
తక్షణమే కాల్పుల విరమణ : ఐరాస పిలుపు
పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు వీలుగా తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్ ఇజ్రాయిల్, పాలస్తీనాలకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన కసం జరుగుతున్న ప్రయత్నాలకు సహకరించేందుకు వీలుగా తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని, ఇకపై కాల్పుల విరమణ పాటించి శాంతి యత్నాలకు సహకరించాలంటూ అంతర్జాతీయ సమాజం చేసిన విజ్ఞప్తిని ఇటు హమాస్‌తో పాటు ఇజ్రాయిల్ కూడా తిరస్కరించిన నేపథ్యంలో ఐరాస ప్రధాన కార్యదర్శి ఈ విజ్ఞప్తి చేశారు.
ఈయూ ఆందోళన
గాజా సిటీపై ఇజ్రాయిల్ దౌర్జన్యకాండలో పెరుగుతున్న మరణాల పట్ల యూరోపియన్ యూనియన్ ( ఈయూ) ఆందోళన వ్యక్తం చేసింది. దీర్ఘకాల పరిష్కారంతోనే ఈ సంక్షోభం నుంచి బయటపడగలమని ఈయూ ఫారిన్ చీఫ్ కాథరిన్ అఫ్గోన్ వ్యాఖ్యానించారు. బ్రెసెల్స్‌లో సోమవారం ప్రారంభమైన ఈయూ విదేశాంగ, రక్షణ శాఖా మంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాజాపై ఇజ్రాయిల్ దాడులను తక్షణం నిలిపివేయాలని అన్నారు. ఈ రీజియన్‌లో శాంతి భద్రతలను నెలకొల్పేందుకు పరిష్కారాన్ని మనం చదవాలిఅని అఫ్గోన్ చెప్పారు. కాల్పులు విరమించేందుకు తక్షణం చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమైనదని స్వీడన్ విదేశాంగ మంత్రి కార్డ్ బిల్డిట్ వ్యాఖ్యానించారు.