గాలి కబుర్లతో సీఎం టైంపాస్‌

2

– నిర్దిష్టమైన ప్రణాళిక లేదు

– అభివృద్ధికి నిధులెక్కడనుండి తెస్తారు?

– శ్వేత పత్రం విడుదల చేయండి

– షబ్బీర్‌ అలీ

హైదరాబాద్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి):

తెరాస నేతలు రోజుకో వాగ్దానం ఇస్తూ.. వాటిని గాలికొదిలేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ విమర్శించారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామజ్యోతి కార్యక్రమానికి వేలాది కోట్లు కేటాయిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ నిధులను ఎక్కడి నుంచి తెస్తారో చెప్పడం లేదన్నారు. ఇప్పటి వరకు చేపట్టిన పనులకు సంబంధించి నిధుల విడుదల జరగలేదన్నారు. కొత్తగా ఇప్పుడు గ్రామజ్యోతి గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గతంలో నిర్వహించిన వ్యక్తిగత సర్వే ఏమయ్యిందన్నారు.ఇది పాల సీసాలో కొత్త సారాగా ఆయన అభివర్ణించారు. మనవూరు మనప్రణాళికలో 14వేల 658 కోట్లను ప్రకటించారని, అవన్నీ ఏమయ్యాయని, కేవలం ప్రచారానికి తప్ప మరెందుకు పనికి రాలేదన్నారు. ఆ నిధుల్లో కనీసం 20 శాతం అయినా ఖర్చు చేశారా అని ప్రశ్నించారు. ఈ రెండు పథకాలకు తేడా ఏంటని అడిగారు. కేవలం ప్రకటించిన పథకాల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కెసిఆర్‌ ఎప్పుడూ కొత్త పథకాలను ప్రకటించి కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. సిఎం కెసిఆర్‌తో సహా అందరూ ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారని మండిపడ్డారు. ఉస్మానియా ఆస్పత్రిని కూల్చి కొత్తది కడతామని సిఎం కెసిఆర్‌తో సహా మంత్రులు తలసాని,మహ్మూద్‌ అలీ తదితరులు ప్రకటించారని, అయితే హైకోర్టులో మాత్రం అలాంటి ప్రతిపాదన ఏదీ లేదన్నారని అన్నారు. ఇలా పరస్పర విరుద్ద ప్రకటనలతో ప్రజలను గందరగోళ పరుస్తున్నారని విమర్శించారు. అలాగే పెండింగ్‌ ప్రాజెక్టుల సంగతి ఏం చేశారని ప్రశ్నించారు. మెట్రో పనులను గాలికొదిలేశారని మండిపడ్డారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ఇది వెళుతుందో లేదో అన్నది స్పష్టత లేకుండా పోయిందన్నారు. దీంతో పనుల వేగం తగ్గిందన్నారు. అనుకున్న సమయానికి మెట్రో పనులు జరుగుతాయా అన్నది అనుమానంగా మారింది.