గాలి జనార్దన్‌రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు

– బళ్లారిలో ఎన్నికల ప్రచారానికి అనుమతి నిరాకరణ
న్యూఢిల్లీ, మే4(జ‌నం సాక్షి ): అక్రమ మైనింగ్‌ మాఫియా నడిపి మూడేళ్లు జైలుకెళ్లొచ్చిన గాలి జనార్దన్‌రెడ్డికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. కర్ణాటక ఎన్నికల కోసం బళ్లారిలో ప్రచారం చేసుకునే అవకాశం కల్పించాలన్న ఆయన వినతిని తోసిపుచ్చింది. గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌పై బయటకు వచ్చారని, షరతుల ప్రకారం బళ్లారి వెళ్లే అవకాశం ఆయనకు లేదని కోర్టు స్పష్టంచేసింది. ఎన్నికల్లో ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం లేదు అని కోర్టు తేల్చి చెప్పింది. బళ్లారి నుంచి బరిలో ఉన్న తన సోదరుడు గాలి సోమశేఖర్‌రెడ్డి తరఫున ప్రచారం చేయాలని అనుకుంటున్నట్లు జనార్దన్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. ఆయన ఓటు కూడా వేయాలనుకుంటున్నారని, ప్రచారం కోసం పది రోజులపాటు బెయిల్‌ నిబంధనలను సడలించాలని ఆయన తరఫు లాయర్‌ కోర్టును కోరారు. సాక్షాత్తూ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షానే ఆయనను పక్కన పెట్టినా బళ్లారి చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలి జనార్దన్‌రెడ్డి పార్టీ తరఫున ప్రచారం చేస్తుండటం గమనార్హం. తన సోదరుడితోపాటు తన సన్నిహితుడు, డిప్యూటీ సీఎం అభ్యర్థి శ్రీరాములు తరఫున గాలి ప్రచారం చేస్తున్నారు.