గిరిజన గూడాల్లో వేగంగా వ్యాక్సినేషన్‌


సత్ఫలితాలు ఇస్తున్న అవగాహన కార్యక్రమాలు
45 రోజుల స్పెషల్‌ డ్రైవ్‌లో లక్ష్యం దిగా చర్యలు
ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌27 (జనం సాక్షి)    : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో అధికారుల శ్రమ ఫలిస్తోంది. నేరుగా గూడాలకు వెళ్లి వ్యాక్సిన ఇస్తున్నారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం అనుకున్న స్థాయిలో ముందుకు సాగుతుందో లేదోనని అధికార యంత్రాంగం తొలుత అనుమానించినా ప్రయత్నాలు ఫలించాయి. ఆదివాసీ గ్రామాల్లో ప్రజలకు వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించేందుకు కలెక్టర్‌ వ్యూహాత్మకంగా రాయ్‌ సెంటర్ల బాధ్యులతో సమావేశం నిర్వహించి కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న దానిపై అవగాహన కల్పించారు. దీంతో ఆదివాసీ సంఘాల నాయకులు టీకా కార్యక్రమంపై గూడాల్లో పెద్దఎత్తున ప్రచారం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్‌లో భాగంగా ఆదివాసీ గ్రామాలకు వెళ్తున్న వైద్య సిబ్బందికి ఆదివాసులు స్వచ్ఛందంగా వచ్చి వ్యాక్సినేషన్‌ చేయించు కుంటుండడంతో వ్యాక్సినేషన్‌లో మరింత వేగాన్ని పెంచారు. స్పెషల్‌ డ్రైవ్‌ ప్రారంభించి టీకాలు వేస్తున్నారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం అనుకున్న స్థాయిలో వేగంగా సాగుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన 45రోజుల్లోపు జిల్లాలోని ప్రతీఒక్కరికి వ్యాక్సినేషన్‌ పూర్తిచేసి లక్ష్యాన్ని చేరుకుంటామని వైద్యులు ధీమాగా చెబుతున్నారు. కరోనా మహమ్మారిని అడ్డుకునే చర్యల్లో భాగంగా ఇలా ప్రారంభించిన వ్యాక్సినేషన్‌
కార్యక్రమానికి జిల్లాలో సరికొత్త ఊపు లభిస్తోంది. టీకాలపై గిరిజన గూడాల్లో ఉన్న అపోహలు క్రమంగా తొలగిపోవడంతో ప్రజలు స్వచ్ఛందంగా వ్యాక్సినేషన్‌ వేయించుకునేందుకు తరలివస్తున్నారు. దాంతో వ్యాక్సినేషన్‌ కేంద్రాలు జనంతో రద్దీగా కనిపిస్తున్నాయి. తొలుత ఏజెన్సీలో వ్యాక్సినేషన్‌ పక్రియ నెమ్మదించడానికి కారణాలను విశ్లేషించింది. ప్రభుత్వం కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావమయ్యే ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అయిన వైద్య, పోలీసు, రెవెన్యూ సిబ్బందితోపాటు పారిశుధ్య కార్మికులు, ఉపాధ్యాయులకు వరుస క్రమంలో దశల వారీగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని అమలు చేసింది. వారితో పాటే 60ఏళ్లు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారికి మాత్రమే టీకాలు ఇవ్వడంతో కార్యక్రమం అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేదు. ఈ క్రమంలో కేందప్రభుత్వం 18ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని నిర్ణయించింది. మరోవైపు జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రరూపం దాల్చడంతో వేలాది మంది వ్యాక్సిన్లకోసం ఆరోగ్యకేంద్రాలకు పరుగులు తీసిన పరిస్థితి కొనసాగింది. తొలుత జిల్లాలో కార్యక్రమం మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఈ పక్రియలో వేగం పెంచేందుకు 45రోజుల పాటు స్పెషల్‌ డ్రైవ్‌ ప్రారంభించింది. సగటున ప్రతీరోజు జిల్లాలో 13 వేల 8వందల మందికి వ్యాక్సినేషన్‌ వేసేలా కార్యచరణ ప్రారంభించారు. ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో ప్రతీరోజు వంద మందికి వ్యాక్సినేషన్‌ చేయాలని తలపెట్టారు. ఇది సత్ఫలితాలు ఇవ్వడంతో కలెక్టర్లు అధికారులను అభినందించారు.