గిరిజన తండాలకు మహర్దశ

కొత్తగా పెరగనున్న పంచాయితీలు

ఆదిలాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కొత్త పంచాయితీల ఏర్పాటుతో గిరిజన తండాలకు మహర్దశ పట్టనుంది. అనేక తండాలు పంచియితీలుగా మారనున్నాయి. దీంతో గ్రామాల్లో గిరిజనులకు సర్పంచులుగా ఎదిగే అవకావం రాబోతున్నది. ప్రస్తుతం ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో 3 ననుంచి 15వరకు గిరిజన తండాలు, అనుబంధ గ్రామాలున్నాయి. గిరిజన గ్రామాల ప్రజలు గ్రామ పంచాయతీ కేంద్రానికి వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని గిరిజన తండాలు 5 నుంచి 10కి.మి. దూరంలో ఉండడంతో.. గ్రామ పంచాయతీలో పనులుంటే.. ఒక రోజంతా సమయం వృథా అవుతోంది. వివిధ రకాల పనుల కోసం గ్రామ పంచాయతీ కేంద్రానికి వెళ్లటం కష్టంగా ఉండడంతో.. తాజాగా ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీ లుగా మారుస్తుండటంతో గిరిజనులకు ఉపయోగకరంగా మారనుంది. గిరిజన తండాలు గ్రామ పంచాయతీ లుగా ఏర్పాటు చేయడంతో.. పరిపాలన సౌలభ్యం కలగనుంది. మరికొందరికి రాజకీయంగా పలు పదవులు లభించనున్నాయి. సర్పంచి, వార్డు సభ్యులు, కార్యదర్శి స్థానికంగా ఉండటంతో.. పర్యవేక్షణ పెరుగుతుంది. వివిధ రకాల ధృవపత్రాలపై సంతకాలకు కార్యదర్శి కోసం వేరే గ్రామానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. దీంతో వ్యయ ప్రయాసలు తప్పనున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్యం, ఇతర సమస్యలు త్వరిత గతిన పరిష్కారం కానున్నాయి. గ్రామాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు వీలుంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఉన్నప్పుడే ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేరగా.. తాజాగా మరికొన్ని తండాలు, గ్రామాలను చేరుస్తున్నారు. అనుబంధ గ్రామాలను పంచాయతీలుగా మార్చేందుకు అవసరమైన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో జిల్లా పంచాయతీ అధికారులు దృష్టి సారించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 866గ్రామ పంచాయతీలు ఉండగా.. కొత్తగా మరో 224తండాలు, గూడెంలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్లాయి. గత సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తండాలు, గూడెం, గిరిజన ఆవాసాలను గ్రామ పంచాయతీలుగా మార్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ప్రస్తుత ఆదిలాబాద్‌ జిల్లాలో 243 గ్రామ పంచాయతీలు ఉండగా.. కొత్తగా మరో 101గ్రామ పంచాయతీలు ఏర్పాటుకు ప్రతిపాదించారు. నిర్మల్‌ జిల్లాలో ప్రస్తుతం 240గ్రామ పంచాయతీలుండగా.. మరో 52తండాలు, గూడెంలను కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపారు. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 173గ్రామ పంచాయతీలుండగా.. మరో 57గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. మంచిర్యాల జిల్లాలో 210గ్రామ పంచాయతీలుండగా.. మరో 14తండాలు, గూడెంలు కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. దీంతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్దం కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్‌ ఇటీవలే ఆదేశించారు. జూలై 2018 నాటికి గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున ఎన్నికల పక్రియ కొనసాగించాలన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మేరకు మరికొన్ని గ్రామ పంచాయతీలు పెరగనున్నాయన్నారు. సమగ్ర కుటుంబ సర్వే జనాభా ప్రకారంగా 500ల జనాభ కలిగిన గిరిజన తండాలు, గూడాలను కలిపి ఒక గ్రామ పంచాయతీగా గుర్తించాలని అన్నారు. మూడు కిలో విూటర్ల పరిధిలో క్లస్టర్‌ గ్రామాలను కలిపి 500జనాభ గల వాటిని ఒక గ్రామ పంచాయతీలుగా గుర్తించనున్నారు. అదే విధంగా మైదాన ప్రాంతాల్లో 2కి.విూటర్ల పరిధిలోని క్లస్టర్లను గ్రామ పంచాయతీ హెడ్‌క్వార్టర్స్‌గా హ్యాబిటేషన్ల జాబితాలను తయారు చేసి క్లస్టర్లుగా గుర్తించాలని సూచించారు. తండాల జనాభా 500, అంతకు మించి ఉండాల్సి ఉంటుంది. మూడు కిలోవిూటర్లు, అంతకంటే ఎక్కువ దూరం ఉన్న గ్రామాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు దృష్టి పెట్టారు. ఒకే తండాలో 500జనాభా లేకుంటే.. వివిధ తండాలను కలిపి ఒక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయనున్నారు. పాత వాటితో పాటు కొత్తగా ఆవిర్భవించే గ్రామ పంచాయతీలకు కూడా ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. జూలై 2018 నాటికి పాత గ్రామ పంచాయతీల పాలక వర్గాల గడువు ముగుస్తుండగా.. గడువులోపే ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమవుతోంది.