గిరిజన యువతికి న్యాయం చేయాలని రాస్తారోకో.

రాస్తారోకో చేస్తున్న దళిత సంఘాల నాయకులు.
బెల్లంపల్లి, సెప్టెంబర్25,(జనంసాక్షి)
ప్రేమ పేరుతో మోసపోయిన గిరిజన యువతికి న్యాయం చేయాలని కోరుతూ ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని కూరగాయల మార్కెట్ చౌరస్తాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం మైలారం గ్రామంలో బొమ్మేన సంతోష్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన గిరిజన యువతిని ఆరు సంవత్సరాలుగా ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా, మానసికంగా వాడుకొని తీరా ఇప్పుడు అయిదు లక్షల కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని చెప్పి, అంత కట్నం ఇచ్చుకోలేము అనేసరికి మరో యువతితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని, వెంటనే పోలీసు అధికారులు సదరు యువకునిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాస్తారోకో చేశారు. సదరు యువకుడు బీజేపీ నాయకుల అండదండలతో చెలరేగి పోయి గిరిజన యువతికి అన్యాయం చేస్తున్నాడని వారు ఆరోపించారు. వెంటనే పోలీసులు అట్టి యువకునిపై కఠిన చర్యలు తీసుకోని గిరిజన యువతికి న్యాయం జరిగేలా చూడాలని, లేనట్లయితే జిల్లా వ్యాప్తంగా దళిత, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసర్ల యాదగిరి, తెలంగాణా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు కుంభాల రాజేష్, రాష్ట్ర యువజన అధ్యక్షుడు అసాది మధు, కార్యదర్శి ఎరుకల నర్సింగ్, ఉపాధ్యక్షుడు మద్దెల గోపి, పట్టణాధ్యక్షుడు బందెల మురళి, వర్కింగ్ ప్రెసిడెంట్ పట్నం చక్రధర్, నాయకులు కలాలి నర్సయ్య, గోమాస రాజం, దుర్గం గోపాల్, దుర్గం సురేష్, బాధిత గిరిజన యువతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.