గిరిజన హక్కులను కాలరాస్తున్నారు
అనంతపురం,జూన్20(జనం సాక్షి): 70 ఏళ్లుగా నేటికి గిరిజనులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారని గిరజన సంఘాల నేతలు తెలిపారు. ఇప్పుడిప్పుడే విద్యా, ఉద్యోగ అవకాశాలను అందుకుంటున్న గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం వారి అభివృద్ధిని అడ్డుకునేందుకు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చి కుట్ర చేస్తోందన్నారు. అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడం సరికాదన్నారు. తమ గోడు వినిపించే మంత్రి లేకనే తమకు ఇలాంటి అన్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారని విమర్శించారు. ఓట్ల రాజకీయాల కోసం అన్నదమ్ములుగా ఉన్న వాల్మీకులు, గిరిజనుల మధ్య చిచ్చు పెడతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వైఖరితో వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మాణించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపించడాన్ని తీవ్రంగా ఖండించారు. గిరిజనులు ఏకతాటిపై వచ్చి హక్కులను కాపాడుకునేందుకు ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు.