గీతం కూల్చివేతలపై సర్వత్రా నిరసనలు

ప్రభుత్వ చర్యను తప్పుపట్టిన స్థానికులు
రాజకీయ కక్షపూరతి చర్య అన్న పార్టీల నేతలు
విశాఖపట్టణం,అక్టోబరు 26(జ‌నంసాక్షి):  గీతం విద్యాసంస్థల ప్రహరీని అర్ధరాత్రి కూల్చడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకాలం అధికారంలో ఉన్న అవంతి శ్రీనివాస్‌, బొత్స
సత్యనారాయణలకు గీతం ఆక్రమణలు కానరాలేదా అని నిలదీస్తున్నారు. ఒకవేళ ఆక్రమణలు ఉంటే వారికి నోటీసులు ఇచ్చి, ఆక్రమించిన స్థలానికి బహిరంగ మార్కెట్‌ రేటును వసూలు చేసి ఉంటే బాగుండేదని
స్థానికులు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు గీతం విశ్వవిద్యాలయంపై కూడా శనివారం నాడే వందలాది మంది సిబ్బందితో దాడి చేసి నిర్మాణాలు కూలగొట్టారు. ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. ప్రపంచ స్థాయి పేరు ప్రతిష్టలున్న సంస్థపై దాడి చేస్తే దానివల్ల రాష్టాన్రికే చెడ్డపేరు వస్తుందనే చిన్న విషయాన్ని..అటు నాయకులు, ఇటు అధికారులు విస్మరించారు. గీతం రాత్రికి రాత్రి నిర్మాణాలు చేయలేదు. అయినా కూల్చివేశారు. ఇదిలావుంటే ఉగ్రవాదులపై దాడులు చేసినట్టుగా కూల్చాల్సిన అవసరం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అభిప్రాయపడ్డారు. ఆస్పత్రి కోసం కొంత ప్రభుత్వ భూమిని లోగడ తీసుకున్నామని గీతం మూర్తి చెప్పారన్న విషయాన్ని నారాయణ గుర్తు చేశారు. సీఎం జగన్‌ విధ్వంసంతోనే పాలన మొదలుపెట్టారన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ భూములకు సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని, సీఎం జగన్‌కు ఖలేజా ఉంటే ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని సవాలు విసిరారు.  విశాఖలో గీతం విద్యా సంస్థల కట్టడాల కూల్చివేత కక్ష సాధింపు చర్యేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఓ ప్ర కటనలో విమర్శించారు. రాష్ట్రంలో ఒక పక్క వరదలు, మరోపక్క కరోనా విపత్తులతో ప్రజలు అల్లాడుతుంటే.. ఈ ప్రభుత్వానికి పట్టకపోగా ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. పరదేశిపాలెంలో మాజీ మంత్రి ధర్మాన తన కుమారుడి పేరుతో ప్రభుత్వ భూములు కాజేశారని, కొమ్మాది సర్వే నంబర్‌ 28/2లో పది ఎకరాల భూమిని కె.శ్రీనివాసరెడ్డి, సర్వే నంబర్‌ 154/3లో మిరియాల సుగుణమ్మ 5 ఎకరాలు కాజేశారని, వారిపై చర్యలు ఏవని ప్రశ్నించారు.  విశాఖలోని గీతం విశ్వ విద్యాలయంపై దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించడం ప్రభుత్వ టెర్రరిజానికి నిదర్శనమని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. ఇప్పటికే విద్యా వైద్య పారిశ్రామిక సంస్థలు ఏపీకి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ రాష్టాన్ని దక్షిణాది బిహార్‌ అని పిలుస్తూ అనేక కంపెనీలు పొరుగు రాష్టాల్రకు తరలిపోతున్నాయి. ప్రభుత్వ వైఖరికి గీతం సంఘటన మరోసారి అద్దం పట్టింది. అత్యున్నత విద్యా సంస్థ ‘గీతం’ కూల్చివేతను ఖండిస్తున్నాను. కోర్టులో ఉన్న వివాదంపై ఏ ఆదేశాలు రాకముందే కూల్చి వేయడం వైసీపీ కక్ష సాధింపునకు నిదర్శనం. ప్రతిష్టాత్మక విద్యాసంస్థపై ఇటువంటి విధ్వంసానికి దిగడం రాష్ట్ర ప్రగతికి చేటన్నారు. గీతంపై దాడి ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపు చర్యేనని మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. రెవెన్యూ, పోలీస్‌ అధికారులే దీనిని ఎక్కువగా ఉపయోగించుకున్నారన్నారు. విశాఖలో విజయసాయిరెడ్డి ఏది చెబితే అది చేస్తున్నారని, దీనివల్ల జగన్‌ నిండా మునిగిపోవడం ఖాయమన్నారు. జగన్‌ తండ్రి వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు గీతంపై దాడికి దిగారని, కానీ సలహాదారుల మాటలువిని ఆయన వెనకడుగు వేశారన్నారు. గీతం 37 ఎకరాలు ఆక్రమించిందని చెబుతున్నారని, ఆ భూమి అంతా ప్రభుత్వం స్వాధీనంలోనే ఉందన్నారు. ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అయ్యన్న ఆరోపించారు. గీతం ప్రధాన ప్రవేశ ద్వారం ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిన భూమిలో నిర్మించారని, దానిని అధికారులు ఎలా పడగొడతారని ప్రశ్నించారు.