గుంటూరు మైనార్టీ సదస్సులో విధ్వంసానికి కుట్ర

కుట్రదారు హబీబుల్లా పలు కేసుల్లో ముద్దాయి

విూడియాతో మంత్రి ప్రత్తిపాటి

విజయవాడ,ఆగస్ట్‌31(జ‌నం సాక్షి): నారా హమారా-టిడిపి హమారా సభను భగ్నం చేయాలనే వైసిపి నాయకులు దుర్మార్గపు ఆలోచన చేశారని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కుల, మత, ప్రాంత ఘర్షణలను సృష్టించాలని వైసిపి ప్రయత్నిస్తోందని, తుని సంఘటనలో ఒక కమ్యూనిటీని కేసుల్లో ఇరికించాలనే కుట్ర చేశారని తెలిపారు. జగన్మోహన్‌రెడ్డి అరాచకవాదిలా తయారయ్యారని దుయ్యబట్టారు. ముస్లిం సమాజాన్ని కేసుల్లో ఇరికించాలని వైసిపి నాయకులు ప్రయత్నిస్తున్నారన్నారు. కుట్రకు పాత్రదారుడైన హబీబుల్లా అనేక కేసులు, నేరాల్లో ముద్దాయియని, వైసిపికి చెందిన 9 మంది కూడా నారా హమారా టిడిపి హమారా సభలో అల్లర్లు సృష్టించడానికి ట్రైన్‌లో వచ్చారని మంత్రి తెలిపారు. ముస్లీం, మైనార్టీ సమాజానికి జగన్‌ క్షమాపణ చెప్పాలన్నారు. 2014లో ముస్లీంలతో ఓట్లు వేయించుకొని ఈ రోజు బిజెపితో అంటకాగుతున్నారని మండిపడ్డారు. వైసిపి కుట్ర రాజకీయాల పట్ల ముస్లీంలు వ్యతిరేకంగా ఉన్నారని పేర్కొన్నారు. ముస్లీం సమాజం మొత్తం చంద్రబాబు వెంట ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. మోడీ చేసిన నమ్మక ద్రోహానికి చంద్రబాబు ధర్మపోరాటం చేస్తున్నారని మంత్రి పుల్లారావు వ్యాఖ్యానించారు.

తుని తరహాలో గొడవలకు కుట్ర

తుని తరహాలో తెదేపా హామారా నారా హామారా కార్యక్రమంలో వైకాపా కార్యకర్తలు గందరగోళం సృష్టించాలని చూశారని ఏపీ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌ జలీల్‌ ఖాన్‌ ఆరోపించారు. సభలో జరిగిన గందరగోళానికి జగన్‌ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అధికారంలో లేనప్పుడే ఇంత దౌర్జన్యం చేస్తే అధికారంలోకి వస్తే ఇంకా ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. వైకాపాకు వచ్చే ఎన్నికల్లో 30 సీట్లు లోపే వస్తాయని జోస్యం చెప్పారు. జగన్‌ చేసేది సంకల్పయాత్ర కాదని, పిక్నిక్‌ యాత్ర అని ఎద్దేవాచేశారు. అవినీతి పరుడైన జగన్‌కు అవినీతి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. జగన్‌ స్వార్థపరుడన్న విషయాన్ని ప్రతి ముస్లిం అర్థం చేసుకున్నారని చెప్పారు. త్వరలోనే అన్ని తెగలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.

 

తాజావార్తలు