గుజరాత్‌లో భారీగా భద్రత

టేళ్ల బంద్‌ పిలుపుతో అప్రమత్తమైన ప్రభుత్వం
అహ్మదాబాద్‌,ఏప్రిల్‌18 :  పటేల్‌ వర్గీయులు గుజరాత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జర్కుండా భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని గతంలో ఆందోళన చేసిన హర్దిక్‌ పటేల్‌ను జైలు నుంచి విడుదల చేయాలని ఆదివారం నుంచి పటేల్‌ కులస్థులు తీవ్ర ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌, సూరత్‌, మెహ్‌సనా, తదితర ప్రాంతాల్లో ప్రభుత్వం రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ను రంగంలోకి దించింది. మరో 20 కంపెనీల స్టేట్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ను కూడా రాష్ట్ర వ్యాప్తంగా మోహరింపజేశారు. సర్దార్‌ పటేల్‌ గ్రూపు, హార్దిక్‌ పటేల్‌ నేతృత్వంలోని పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి ఆధ్వర్యంలో జైల్లో పెట్టిన తమ నేతలను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈరోజు ‘గుజరాత్‌ బంద్‌’కు పిలుపునిచ్చారు. ఆదివారం మెహ్‌సనాలో పటేల్‌ కులస్థులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఆందోళనకారులు భద్రత సిబ్బందిపైకి రాళ్లు విసరడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. అహ్మదాబాద్‌, సూరత్‌ లో కూడా వెంటనే అల్లర్లు వ్యాపించాయి. మెహ్‌సనాలో అధికారులు కర్ఫ్యూ విధించారు. మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను పెంచారు