గుజరాత్‌ వర్షాలకు 29మంది మృతి

న్యూఢిల్లీ,జూలై17(జ‌నం సాక్షి): గుజరాత్‌ వరదలకు ఇప్పటి వరకు 29మంది మృత్యువాత పడ్డారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాలతో గుజరాత్‌లో ఇప్పటివరకు 29 మంది మరణించారని ప్రకటించారు. గుజరాత్‌ దక్షిణ ప్రాంతంలో ముఖ్యంగా వల్సాద్‌, నవసరాయ్‌, జూనాగఢ్‌, గిర్‌ సోమ్‌నాథ్‌, అమ్రేలి జిల్లాల్లో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉందని అధికారులు వెల్లడించారు. జాతీయ రహదారులు, రాష్టీయ్ర రహదారులు సహా చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రంగంలోకి దిగి సహాయ చర్యలు ప్రారంభించారు. రాష్ట్రంలోని 11 ప్రాంతాల్లో సిబ్బంది మోహరించి ప్రజలకు సహాయం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గత వారం నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి.

కేరళలో 11మంది మృతి

కేరళలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. కుండపోతగా వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుధవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వర్షాల కారణంగా రాష్ట్రంలో ఈరోజు నలుగురు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. జులై 9 నుంచి 11 మంది చనిపోయినట్లు తెలిపార తిరువనంతపురం, కొల్లామ్‌, పతానంతిట్ట, అలపుళ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిస్సూర్‌ జిల్లాలో వర్షాల కారణంగా ఈరోజు పాఠశాలలు, కళాశాలలుమూతపడ్డాయి. కేరళ విశ్వవిద్యాలయం బుధవారం నిర్వహించాల్సిన అన్ని పరీక్షలను జులై 21కి వాయిదా వేసింది. ఎనిమిది ప్యాసింజరు రైళ్లు రద్దయ్యాయి. ఇడుక్కి జిల్లాలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. కేరళలో వర్షాల కారణంగా దాదాపు 2వేల కుటుంబాలను 46 ప్రాంతాల్లోని శిబిరాలకు తరలించారు.