గుట్టలో ముస్లింలపై వివక్ష

2

– రోడ్డున పడ్డ రెండు కుటుంబాలు

– నోరు మెదపని సర్కారు

హైదరాబాద్‌,ఆగస్ట్‌20(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌ అన్నారు. అది ఎప్పుడు వస్తుందో అల్లాకే తెలుసు.  తెలంగాణ లో ముస్లింలు హిందువులు తేడా వుండదన్నారు.  ఇప్పుడు వారి నోటికాడి ముద్దను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు.. మతాన్ని సాకుగా చూపి.. రెండు ముస్లిం కుటుంబాలకు షాపులు కేటాయించకుండా చుక్కలు చూపిస్తున్నారు.. తెలంగాణ తిరుపతిగా భాసిల్లుతోన్న యాదాద్రిలో ముస్లింల ఆవేదన. యాదగిరి గుట్టలో ఆలయ అధికారుల నిర్ణయం రెండు మైనార్టీ కుటుంబాలను రోడ్డున పడేసింది.. ఇక్కడ ఎన్నో కుటుంబాలు వివిధ వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి.. ఇందులో ముస్లింలు కూడాఉన్నారు.. వీరంతా అన్నదమ్ముల్లా కలసిమెలిసి జీవిస్తున్నారు.. ఇప్పుడు ఆలయ అభివృద్ధి పనులు… దేవాదాయ శాఖ చట్టాలు వీరి మధ్య అంతరానికి అంకురం వేస్తున్నాయి.వందల కోట్లతో దేవాలయాన్ని, చుట్టుపక్కల ప్రాంతాలను వేగంగా అభివృద్ధి చేస్తోంది ప్రభుత్వం.. ఇందులోభాగంగా రోడ్డువిస్తరణ పనులు చేపట్టారు.. ఈ పనుల్లో దాదాపు 60మంది తమ దుకాణాలు కోల్పోయారు.. వీరిలో 58మందికి కొత్త కాంప్లెక్స్‌లలో షాప్‌లు కేటాయించారు అధికారులు.. అయితే మతం ఆధారంగా ఓ రెండు కుటుంబాలను మాత్రం పక్కన పెట్టేశారు.ముప్పైఏళ్లుగా ఈ దుకాణాలపై ఆధారపడి బతుకుతున్న మైనారిటీ కుటుంబాలు అధికారుల నిర్ణయంతో జీవన భృతిని కోల్పోయాయి.. తమ తండ్రుల తరం నుంచి ఇక్కడి భక్తులకు తాము సేవలు అందిస్తున్నామని.. ఇప్పుడు మతం పేరిట తమను ఎందుకు వేరుగా చూస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.అయితే అధికారులు మాత్రం హిందూ దేవాలయ యాక్ట్‌ ప్రకారం ఇతర మతస్తులకు షాప్‌లు కేటాయించలేమని చెబుతున్నారు.. దీంతో ఈ కుటుంబాలు తమ ఆవేదనను సీఎం కేసీఆర్‌ దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.. సోషల్‌ విూడియా వేదికగా తమ బాధను వెళ్లబోసుకుంటున్నాయి.. ఫేస్‌ బుక్‌, వాట్సప్‌ లో తమ బాధను షేర్‌ చేస్తున్నారు ఈ కుటుంబసభ్యులు.. హిందూ, ముస్లీం భాయీ భాయీ అంటూనే తమకు అన్యాయం చేస్తున్నారని వాపోతున్నారు..టీటీడీ నిబంధనలన్నీ గుట్టలోనూ అమలు చేస్తే మైనారిటీ కుటుంబాలు మరింత ఇబ్బందులు పడే అవకాశముందని వారు ఆవేదన చెందుతున్నారు. తామిక్కడ నివసించే పరిస్థితిని కోల్పోతామని.. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు దుకాణాలు కేటాయించాలని ముస్లిం కుటుంబాలు కోరుతున్నాయి..