గురప్ప వాగుపై ముందస్తు చర్యలు చేపట్టాలి* – సామాజిక ఉద్యమకారుడు కొల్లు వెంకటేశ్వరరావు డిమాండ్
మునగాల, సెప్టెంబర్ 29(జనంసాక్షి): మండలంలోని తాడువాయి గురప్ప వాగుపై ముందస్తు చర్యలు చేపట్టాలని అనేకమార్లు ప్రభుత్వ అధికారులను సూచించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని సామాజిక ఉద్యమకారుడు కొల్లు వెంకటేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ కార్మికులకు మరియు ఇతర కార్మికులకు, ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా, రాకపోకలకు ఇబ్బంది కలుగకుండా ఆర్అండ్బి అధికారులు, ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని, ఇంతకు ముందు అనేకమార్లు వివిధ సామాజిక మాధ్యమాల్లో అనేక పత్రికల్లో కోరారని తెలిపారు. ప్రభుత్వ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు గురప్ప వాగును పట్టించుకోకపోవడంతో నేడు వరుసగా కురుస్తున్న వర్షాలకు ఆలుగులు పోస్తుందని తెలిపారు. ఇలాగే ప్రతి ఒక్కరు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం వలన భవిష్యత్తులో రవాణా నిలిచిపోయి ప్రజలకు మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికైనా ఆర్అండ్బి అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో చొరవ తీసుకుని రానున్న నష్టం నుండి తప్పించాలని, గురుప్పవాగుపై వెంటనే బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.