గురుకుల టీచర్ల పరీక్షలు వాయిదా వేయాలి
సచివాలయం ముందు అభ్యర్థుల ఆందోళన
హైదరాబాద్,సెప్టెంబర్15(జనంసాక్షి): హైదరాబాద్ సెక్రటేరియట్ గేట్ ముందు గురుకుల టీచర్ ఉద్యోగాల అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈ నెల 26న జరగాల్సిన గురుకుల టీచర్ల పరీక్షలను నెల రోజుల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్ ముందు ఆందోళన చేశారు.సీఎస్ శైలేంద్రకుమార్ జోషిని కలిసేందుకు ఐదుగురు విద్యార్థులకు అనుమతి ఇచ్చారు పోలీసులు. పది రోజుల కిందటే పరీక్షల తేదీని ఖరారు చేయడంపై అసంతృప్తి వ్యక్తంచేసిన అభ్యర్థులు. ప్రిపరేషన్ కు సమయం సరిపోదని నిరసన తెలిపారు.గురుకుల టీచర్ పోస్టులకు 3 పరీక్ష పేపర్లు ఉండటం.. నెగెటివ్ మార్కింగ్ ఉండటం, సిలబస్ ఎక్కువగా చదవాల్సి రావడంతో.. పరీక్షను నవంబర్ లో నిర్వహించాలంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కు విన్నవించామన్నారు. కనీసం 45రోజుల ముందు పరీక్ష తేదీని ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. సెప్టెంబర్ 26న గురుకుల టీచర్ పరీక్షలు నిర్వహించడం వల్ల పంచాయతీ సెక్రటరీ, వీఆర్వో , ఆర్‌ఆర్బీ పరీక్షలకు సరిగా ప్రిపేర్ కాలేకపోతున్నామన్నారు. టీచర్ ఉద్యోగాలపై ఎన్నో ఆశలతో ఉన్న అభ్యర్థులకు పరీక్షతేదీని నెల రోజుల పాటు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.