గుర్‌దాస్‌పూర్‌ ఆపరేషన్‌ పూర్తి

5

– హోరాహోరీ ఎన్‌కౌంటర్‌

– నలుగురు మిలిటెంట్ల హతం

– మిలిటెంట్ల తూటాలకు ఎనిమిది మంది మృతి

– మృతుల్లో ఎస్పీతో సహా నలుగురు పోలీసులు, ముగ్గురు పౌరులు

పంజాబ్‌ 27 జూలై (జనంసాక్షి):

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ జిల్లాలో సోమవారం ఉగ్రవాదులు భీకర దాడికి తెగబడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చి ఓ దుకాణంపై దాడి చేసి మారుతీ 800 కారు ఎత్తుకెళ్లారు. బస్సు, పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి ఆరుగురి ప్రాణాలను బలిగొన్నారు. వీరిలో ముగ్గురు పౌరులు, నలుగురు పోలీసులు ఉన్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో గురుదాస్‌పూర్‌ డిటెక్టివ్‌ ఎస్పీ బల్జీత్‌సింగ్‌ మృతి చెందారు. మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. దాదాపు 10గంటలకు పైగా ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి.

సైనిక దుస్తుల్లో ప్రవేశం

పంజాబ్‌ రాష్ట్రంలోని గురుదాస్‌పూర్‌ జిల్లాలోని దీనానగర్‌ పోలీస్‌స్టేషన్‌పై సోమవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. సైనికుల దుస్తుల్లో వచ్చిన దుండగులు అత్యాధునిక ఆయుధాలతో పోలీస్‌స్టేషన్‌పై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఆరుగురు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

సోమవారం తెల్లవారుజామున గురుదాస్‌పూర్‌లోని ఓ రెస్టారెంట్‌ యజమానిని తుపాకులతో బెదిరించిన ఉగ్రవాదులు అతడి కారును అపహరించుకుపోయారు. అమృత్‌సర్‌-పఠాన్‌కోట్‌ జాతీయరహదారిపై ఓ బస్సుపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో పలువురు ప్రయాణీకులు గాయపడ్డారు. అక్కడి నుంచి అదే కారులో సైనికుల దుస్తుల్లో పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని అత్యాధునిక ఆయుధాలతో కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు తేరుకునేలోపే విచక్షణారహితంగా దాడికి పాల్పడటంతోనే ఏడుగురు పోలీసులు సహా తొమ్మిది మంది మృతిచెందారు. ఈ దాడిలో 10 మంది ఉగ్రవాదులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల్లో ఓ మహిళ కూడా ఉందని గాయపడిన పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు దేశంలో దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘావర్గాలు కొద్దిరోజుల క్రితమే హెచ్చరించిన విషయం తెలిసిందే.

గురుదాస్‌పూర్‌లో విస్తృతంగా తనిఖీలు

గురుదాస్‌పూర్‌లో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో పంజాబ్‌ పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. గురుదాస్‌పూర్‌ పట్టణాన్నంతా భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. పఠాన్‌కోట్‌-గురుదాస్‌పూర్‌ మధ్య రైల్వే పట్టాలపై ఐదు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో మరిన్ని చోట్ల ఉగ్రవాదులు బాంబులు అమర్చి ఉంటారన్న కోణంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైల్వేస్టేషన్‌లో జాగిలాల సాయంతో అణువణువునా పరిశీలిస్తున్నారు. ప్రయాణికుల లగేజీని తనిఖీ చేస్తున్నారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.పఠాన్‌కోట్‌-గురుదాస్‌పూర్‌ రైల్వేట్రాక్‌పై పేలేందుకు సిద్ధంగా ఉన్న ఐదు బాంబులను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. రైలు పట్టాలను పేల్చడం ద్వారా భారీస్థాయిలో ప్రాణనష్టం కలిగేలా ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.

బాదల్‌కు రాజ్‌నాథ్‌సింగ్‌ ఫోన్‌

పోలీస్‌స్టేషన్‌పై ఉగ్రవాదుల దాడి ఘటనపై కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆరా తీశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌కు ఫోన్‌ చేసిన రాజ్‌నాథ్‌ ఘటన తాలూకు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రధాని మోదీ అత్యవసర సమావేశం

పంజాబ్‌లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పార్లమెంటులో సీనియర్‌ మంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మనోహర్‌ పారికర్‌, అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ సంర్భంగా గురుదాస్‌పూర్‌లో ఉగ్రవాదుల దాడిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. అంతకుముందుక జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తో మోదీ సమావేశమైన ఘటన తాలూకు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

లోక్‌సభలో విపక్షాల ఆందోళన

దిల్లీ: పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో లోకసభ అట్టుడుకుతోంది. ఈ ఘటనపై కేంద్రం ప్రకటన చేయాలని విపక్షాలు ఆందోళన చేపట్టాయి.

చర్చకు సిద్ధం: వెంకయ్యనాయుడు

గురుదాస్‌పూర్‌ ఘటనపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు లోక్‌సభలో ప్రకటించారు. దీనిపై చర్చ చేపట్టాలని విపక్షాలు చేస్తున్న డిమాండ్‌పై ఆయన స్పందించారు. ఎన్‌కౌంటర్‌ ఇంకా జరుగుతోందని.. అది ముగిశాక ప్రకటన చేస్తామని పేర్కొన్నారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాన్ని రాజకీయం చేయడం తగదని విపక్షాలకు సూచించారు.